హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఎల్‌అండ్‌టి ఛైర్మన్‌ గాడ్గిల్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి లేఖలు రాసిన మాట వాస్తవమేనని, ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌శర్మతో గాడ్గిల్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్రోరైలు పనులు ఆగిపోతాయంటూ పత్రికల్లో కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌అండ్‌టిపై దుష్ప్రచారం చేసేందుకు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని స్పష్టం చేశారు.  భారీప్రాజెక్టు నిర్మాణ దశలో చిన్నచిన్న సమస్యలు రావడం సహజమేనని చెప్పారు. మెట్రో విషయంలో గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో అనేక సంప్రదింపులు జరిపామని వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తాము లేఖలు రాసిన మాట వాస్తవమేనని, ఇప్పటి వరకు అనేక ఉత్తరాలు రాశామని, లేఖలు రాయడం నేరం కాదని ఆయన తెలిపారు. ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సహజమేనని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లేఖలు రాస్తున్నామని వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకేనన్నారు. మెట్రో మార్గంలో మార్పులపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదన్నారు. లాభసాటి ప్రాజెక్టు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: