ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ, శివసేన పొత్తుల మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలంటూ కమలనాధులకు శివసేన హితవచనాలు చెబుతున్నారు. పది రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ కి ఇబ్బందికర పరిస్థితులు స్రుష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎదురైన చేదు అనుభవం మిత్రపక్షాలతో బేరమాడే శక్తిని నీరుగారుస్తోంది. మహారాష్ట్రలో శివసేన ఇప్పటికే ఎకసెక్కాలు మొదలుపెట్టింది. ఈ ఫలితాల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవాలంటూ హితబోధ చేస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. సీఎం పీఠంపై కన్నేసిన రెండు పార్టీలూ పొత్తుల్లో అధిక వాటా పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. చెరి సగం సీట్లలో పోటీ చేయాలని బీజేపీ పట్టుబడుతుండగా, శివసేన ఆ ముచ్చటే లేదంటోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లుండగా చెరి 135 సీట్లలో పోటీ చేసి మిగిలిన 18 సీట్లు ఇతర మిత్రపక్షాలకు వదలిపెడదామంటూ బీజేపీ చెబుతోంది. అయితే, 155 సీట్లకు తగ్గేది లేదంటోంది శివసేన. మోడీ గాలి ఎక్కడ వుందంటూ ప్రశ్నిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ బలహీనపడడంతో శివసేన మరింత స్వరం పెంచుతోంది. ఇంత పరాజయం ఎదురైన తర్వాత కూడా ఇంకా 135 సీట్ల కోసం పట్టుబడుతారా? అంటూ ప్రశ్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: