రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ చార్జీల మోత మోగే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఇందుకు సంబంధించి ఉభయ రాష్ట్రాలపై వత్తిడి తీసుకొస్తున్న ఆర్టీసీ యాజమాన్యం తాజాగా స్పష్టమైన రీతిలో వడ్డన ప్రతిపాదనలూ సిద్ధం చేసినట్టుగా సంకేతాలు అందుతున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని ఆదుకునేందుకు చార్జీల పెంపు ప్రతిపాదనలను రెండు ప్రభుత్వాలూ ఆమోదించే పక్షంలో పల్లె వెలుగు మొదలుకుని అన్ని రకాల బస్సు చార్జీలు పెరగడం తథ్యంగా కనిపిస్తోంది. డీజిల్ చార్జీలు పెరగడం వల్ల సాలీనా 400 కోట్ల రూపాయల భారం పెరగడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం రెండు రాష్ట్రప్రభుత్వాలను కోరినట్లు సమాచారం. ఈమేరకు చార్జీల పెంపుదలపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండు రాష్ట్రప్రభుత్వాలు అంగీకరిస్తే ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పల్లెవెలుగు బస్సులకు కి.మీకు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు కి.మీకు 12 పైసలు, డీలక్స్ బస్సులపై కి.మీకు 14 పైసలు, సూపర్ లగ్జరీ బస్సులకు కి.మీకు 16 పైసలు, ఇంద్ర ఏసి బస్సులకు కి.మీ 20 పైసలు, గరుడ బస్సులకు కి.మీకు 24 పైసలు చొప్పున పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆర్టీసికి గత ఏడాది వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయి. 2013లో ఒకసారి ఆర్టీసి చార్జీలను పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: