చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాక సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. మోడీ భారత ప్రధానిగా వ్యవహరిస్తున్నారా.. లేక ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఏ ప్రధాని దేశం వచ్చినా దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా రావడం ఆనవాయితీ.. కానీ చైనా అధ్యక్షుడిని ఏకంగా తన సొంత రాష్ట్రానికి మోడీ రప్పించుకున్నారు. జిన్ పింగ్ నేరుగా అహ్మదాబాద్ లోని వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా అంటే అదీ లేదు. చైనా అధ్యక్షుడితో భారత్ చేసుకున్న ఒప్పందాల విషయంలోనూ మోడీ గుజరాత్ పక్షపాతధోరణినే ప్రదర్శించారు. మొత్తం మూడు ఒప్పందాలు.. గుజరాత్ కు సంబంధించినవే. చైనాలోని గ్వాగ్ ఝూను, గుజరాత్ లోని అహ్మదాబాద్ ను సోదరనగరాలుగా చేయడం అనేది మొదటి ఒప్పందం. చైనాలోని గ్వాన్ డాంగ్ రాష్ట్రానికి, గుజరాత్ రాష్ట్రానికి మధ్య సాంస్కృతిక, సామాజిక సంబధాలు నెలకొల్పడం రెండో ఒప్పందం లక్ష్యం, మూడోది చైనా అభివృద్ధి బ్యాంకుకు.. గుజరాత్ పారిశ్రామిక విస్తరణ బ్యూరోకు మధ్య కుదిరింది. అన్నీ గుజరాత్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించినవే. ముందు దేశం.. ఆ తర్వాత రాష్ట్రం అన్నది జాతీయ నేతలు వ్యవహరించాల్సిన విధానం. ఈ సూత్రాని మోడీ పూర్తిగా తుంగలో తొక్కారు. ఢిల్లీలో భారత్ ప్రధాని-చైనా అధ్యక్షుల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. చైనా అధ్యక్షుడు మొత్తం 3 రోజుల పర్యటిస్తారు. అలాంటప్పుడు మొదట ఢిల్లీకి వచ్చి.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. ఒప్పందాలు జరిగిన తర్వాత.. రాష్ట్రాల పర్యటన ఉంటే బావుండేది. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు అహ్మదాబాద్ వెళ్లినా.. హైదరాబాద్ వెళ్లినా పెద్దగా విమర్సలుండేవి కాదు.. అలా చేస్తే ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. ఒక వేళ ఎవరైనా వేలెత్తి చూపినా దాన్ని ఎలాగూ మోడీ పట్టించుకోరనుకోండి.. మోడీ సర్కారు ఎంచుకున్న ప్రాధాన్యాల క్రమం గుజరాత్ పక్షపాతధోరణిని చెప్పకనే చెబుతుంది. ఇప్పటికే ఉపఎన్నికలతో తలబొప్పి కట్టిన మోడీ.. ఇలాంటి పొరపాట్లు తగ్గిస్తే మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: