వృద్ధాప్య ఫించన్ల వ్యవహారంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఓవైపు ఫించన్ల మొత్తం పెంచుతున్నామంటూనే మరోవైపు లబ్దిదారుల జాబితాలో కోతవేయడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా దాదాపు రెండున్నరల లక్షల మందిని ఫించన్ల జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు పండుటాకుల గుండెల్లో రైళ్లుపరుగెత్తిస్తున్నాయి. అసలే సంతానం ఆదరించక.. జీవన చరమాకంలో అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవారికి చిన్న మొత్తమే అయినా ఫించను ఎంతో ఆసరాగా ఉంటోంది. ఇప్పుడు ఆ ఫించను ఆగిపోతే.. ఆ ఊపిరి కూడా ఆగే ప్రమాదముంది. అనర్హుల ఏరివేత పేరుతో.. ఉన్నలబ్దిదారులను ఏరివేసే కుట్ర జరుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. అనర్హులను ఏరివేసేందుకు శాస్త్రీయ విధానాలు అవలంభించకుండా.. కమిటీలు వేశారని.. వీటని టీడీపీ నేతలతో నింపేస్తారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. చివరకు వృద్దాప్యం ఫించన్ల లబ్దిదారుల ఎంపికలోనూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించడం దారుణమని విమర్శిస్తున్నాయి. ఈ ఆరోపణలకు తోడు.. ఫించను లబ్ది దారులకు ఆధార్ పథకాన్ని లింక్ చేయడమూ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆధార్ కార్డును అన్నిటికీ అనుసంధానం చేస్తున్నా... వృద్ధుల విషయంలో కొంత సమయం ఇచ్చి వేచి చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఫించన్ల జీవోపై వైకాపా తీవ్రంగా మండిపడుతోంది. ఎన్నికలకు ముందు ఫించన్ వెయ్యి రూపాయలు చేస్తామని ఆశపెట్టి..ఇప్పుడు అసలు కే ఎసరు పెడతారా అని విమర్సిస్తోంది. జీవో జారీ చేసిన తీరుపైనా ఆ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. హడావిడిగా జారీ చేసి.. రెండు, మూడు రోజుల్లోనే లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ చేపట్టడం.. ఫించన్ల ఏరివేత కుట్రలో భాగమని ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. రకరకాల షరతులు విధించి.. ఏదో ఒక రకంగా లబ్దిదారుల సంఖ్యను తగ్గించడమే చంద్రబాబు ఉద్దేశమని వైకాపా విమర్శిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: