విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో పంచాయతీలు.. వివాదాలు. హడావిడిగా అడ్డగోలుగా.. శరవేగంగా ఎన్నికలకు ముందు జరిగిన విభజన అనేక సమస్యలను రెండు రాష్ట్రాలకు మిగిల్చింది. ఐతే.. ఎలాంటి వివాదమైనా.. సమస్యైనా ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే చాలు.. ఇట్టే పరిష్కారమైపోతుందని మరో ఘటన రుజువు చేసింది. మా వాదనే నెగ్గాలనే మంకుపట్టుకు వెళ్లకుండా.. చిత్తశుద్ధితో చర్చలు జరిపితే పరిష్కారం కచ్చితంగా దొరుకుతుందని పులిచింతల విషయంలో మరోసారి తేలిపోయింది. పులించింతల ముంపు ప్రాంతాల సమస్యపై సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. అసలు విషయం ఏమిటంటే.. ఏపీలోని దాదాపు నాలుగు జిల్లాలను నీరందించే పులించింత ప్రాజెక్టు రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. పులిచింతలలో పూర్తిగా నీటిని నిల్వ చేస్తే ఇటు నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలు కూడా ముంపునకు గురవుతాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం, సాగర్ నిండిపోయాయి. దీంతో పులిచింతలలో నీటి నిల్వకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో నల్గొండ ముంపు ప్రాంతాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారులు రంగంలోకి దిగి.. ఆంధ్ర అధికారులతో మాట్లాడారు. పులిచింతల నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు. ఏడున్నర టీఎంసీలు దాటితో నల్గొండ గ్రామాలకు ముంపు ముప్పు వస్తోంది. మరో విషయం ఏమిటంటే.. నల్గొండ ముంపు గ్రామాలకు ఇంతవరకూ పరిహారం అందలేదు. పైసా పరిహారం అందకుండా ఊళ్లు ముంచేస్తామంటే ఎలా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. అందుకే.. పరిహరం అందేంత వరకూ పులిచింతలలో ఏడున్నర టీఎంసీలు మాత్రం నిల్వ చేస్తామని ఆంధ్రా అధికారులు హామీ ఇచ్చారు. పునరావాసానికి నిధులు ఇప్పటికే విడుదల చేశామని.. అవి బాధితులకు చేరగానే గ్రామాలు ఖాళీ చేయాలని ఆంధ్రా అధికారులు కోరారు. మొత్తానికి సమస్య సామరస్యంగా పరిష్కారమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: