ఎంసెట్‌ను రద్దు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తమిళనాడు రాష్ట్రం ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ మార్కులను ప్రాతిపదికగా తీసు కుంటున్నం దున అదే విధానాన్ని రాష్ట్రంలోనూ అమ లు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తమిళ నాడు రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విధా నాన్ని అధ్యయనం చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటనకు బయలు దేరి వెళ్తోంది. ఇంటర్మీడియట్‌ ప్రధమ సంవత్సరం పరీక్ష రద్దుపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ తరహా విధానం కొనసాగు తుండడంతో అక్కడి పరిస్థితులను అంచనా వేసి తద్వారా రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చ ప్రారంభిం చింది. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌.ఎం. డోబ్రియాల్‌, ఏపీ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య పి. విజయ్‌ప్రకాష్‌, అనంతపురం జెఎన్‌టియు రిజిస్ట్రార్‌ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి, కాకినాడ జెఎన్‌టియుకి చెందిన ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య సిహెచ్‌ సాయిబాబు, కళాశాల విద్యా కార్యాలయంలో అకడమిక్‌ గైడెన్స్‌ అధికారిగా ఉన్న అధికారి ఆర్‌. డేవిడ్‌ కుమారస్వామి, సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్పీ శ్రీకాంత్‌ ఈ అధ్యయనం బృందంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా విద్యావిధానంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటైన జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను నెలకొల్పాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 11 విద్యాసంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలన్న అంశంపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యావిధానం, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు, ప్రవేశాల విధానాన్ని కూడా అధ్యయనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తమిళనాడు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కమిటీ పర్యటించి ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. ఈ నెలలోనే ఈ కమిటీ తమిళనాడు రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని ఉత్తర్వులు జారీచేశారు. ఈ సభ్యులు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను ఉన్నత విద్యామండలి పర్యవేక్షించాలని ఆమె కోరింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆరుగురు సభ్యుల బృందం పర్యటనకు సంబంధించి అధికారిక హోదాలోనే వెల్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: