గ్రేట్ బ్రిటన్- స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ అంశం.. తెలుగు నేలపైనా విపరీతమైన చర్చకు ఆస్కారమిచ్చింది. సమైక్యత, విభజనకు సంబంధించిన అంశం కావడంతో.. అందులోనూ రాష్ట్రవిభజన జరిగి కేవలం కొన్ని నెలలే అయిన నేపథ్యంలో చాలామంది తెలుగువారు ఈ రిఫరెండమ్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. తమకు ఆ ప్రాంతం పరిస్థితులు చరిత్ర తెలియకపోయినా.. భావజాలం ఆధారంగా తెలుగు జనం కూడా అభిప్రాయాల పరంగా చీలిపోయారు. తెలంగాణవాదులు స్కాట్లాండ్ ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకుంటే.. సమైక్యవాదులు గ్రేట్ బ్రిటన్లోనే స్కాట్లాండ్ కొనసాగాలని కోరుకున్నారు. ఈమధ్యనే రాష్ట్రవిభజన జరిగిన తీరు చూసిన వారంతా.. స్కాట్లాండ్ విభజనవైపే మొగ్గుతుందని భావించారు. ఓటింగ్ కేవలం స్కాట్లాండ్ వరకే పరిమితం కావడం వల్ల స్కాట్లాండ్ కచ్చితంగా స్వాతంత్ర్యం కోరుకుంటుందని ఎక్స్ పెక్ట్ చేశారు. ఫలితాలు మాత్రం షాక్ ఇచ్చాయి. సమైక్యవాదులు హర్షించేలా.. స్కాట్లాండ్ బ్రిటన్లో భాగంగానే ఉండాలని తీర్పు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ చారిత్రక ఆవిష్కృతమవుతుందని ఆశించిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. సోషల్ మీడియాలోనూ ఈ అంశం బాగానే చర్చకు దారి తీసింది. మొత్తం 30 కంట్రీల్లో ఓటింగ్ జరిగితే.. 26 చోట్ల సమైక్యవాదం నెగ్గింది. కేవలం 4 చోట్ల మాత్రమే విభజనవాదులు పైచేయి సాధించారు. ఐతే మొత్తం ఓటింగ్ శాతం పరిశీలిస్తే విభజనకు అనుకూలంగా 45 శాతం ఓట్లొస్తే.. వ్యతిరేకంగా 55 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం ఐదారు శాతం తేడాతోనే ఫలితం వచ్చింది. ఈ ఓటింగ్ సరళిపై సెటైర్లు కూడా మొదలయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ ను స్కాట్లాండ్ పంపి.. రెండు మూడు సభలు నిర్వహించి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదని కొందరు ఔత్సాహికులు.. కామెడీగా సెటైర్లు వేస్తున్నారు. ఈ రిఫరెండంలో ఓడినా.. స్వాతంత్ర్యకాంక్ష ఎప్పటికీ చెదరిపోదని.. స్కాటిష్ నేషనల్ పార్టీ నేత అలెక్స్ సాల్మండ్ కామెంట్ చేయడం విశేషం.. మరికొందరు తెలుగువారు దీన్ని 1969 తెలంగాణ ఉద్యమంతో పోలుస్తున్నారు. స్కాట్లాండ్ వాసులు ఎప్పటికైనా.. ప్రత్యేక తెలంగాణ తరహాలో విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. ఎక్కడో బ్రిటీష్ నేలపై జరిగిన రిఫరెండమ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి చర్చకు దారి తీయడం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: