తెలంగాణ చారిత్రక నేపథ్యానికి సంబంధించి టీఆర్ఎస్ వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ చరిత్రకారులు, కవులు నిజాం పాలనను కిరాతక పాలనగా అభివర్ణిస్తే.. టీఆర్ఎస్ వాదులు మాత్రం నిజాం పాలనను స్వర్ణయుగం అన్న తరహాలో మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. మొన్నటి సెప్టెంబర్ 17 సందర్భంగా కూడా టీఆర్ఎస్ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం ఈ విమర్శలకు మరింత ఊతమిచ్చింది. ఎన్నికలకు ముందు.. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 సందర్భంగా కేసీఆర్ చెప్పిన మాటలకు ఇప్పుడు ఆయనే స్వయంగా వ్యతిరేకంగా మాట్లాడటం కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 17 అధికారికంగా జరపకపోవడమే కాకుండా.. తెలంగాణ స్టేట్ ను భారత యూనియన్లో కలిపినందుకు నిజాంకు కృతజ్ఞతలంటూ ఏకంగా హోంమంత్రి ప్రకటన చేయడం విశేషం. ఐతే ఈ జిమ్మిక్కులన్నీ మైనారిటీ ఓట్ల కోసమేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ లో ఏమాత్రం పట్టులేని టీఆర్ఎస్.. మైనారిటీ ఓట్ల కోసం.. మజ్లిస్ తో పొత్తు కోసమే ఇంతగా తెగబడుతోందని వారు మండిపడుతున్నారు. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ చీప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ వివాదాలకు తోడు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ పేరు మారుస్తారని వార్తలు వస్తున్నాయి. మెట్రో రైల్ పేరు ముందు నిజ్ చేరుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. నిజ్ అనే పదం నిజాంకు సంకేతంగా చేరుస్తారట. దీనిపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అసలు.. నిజాం కు మెట్రో రైలుకు ఏం సంబంధమని నాగం నిలదీస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని నాగం ఆరోపించారు. అంతే కాదు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఈ పేర్లన్నీ మార్చేస్తారట. విమర్శల వరకూ బాగానే ఉంది కానీ.. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తాక మార్చేస్తామని చెప్పడమే కాస్త ఓవర్ గా అనిపించింది. ఔను.. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం లేకపోతే.. రాజకీయాల్లో ఎలా కొనసాగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: