అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం పై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించినట్టుగా ఉన్నాడు. ఇక్కడ పార్టీ ని పటిష్టపరిచే బాధ్యతను మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన నవీన్ నిశ్చల్ కే అప్పజెప్పాడు జగన్ మోహన్ రెడ్డి. తాజాగా నిర్వహించిన అనంతపురం జిల్లా పార్టీ సమీక్షలో జగన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. ఎన్నికల ముందు ఈ నియోజకవర్గంలో బహుముఖ నాయకత్వం ఉండిందని.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదని జగన్ స్పష్టం చేశాడు. హిందూపురం నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను నవీన్ కే అప్పజెప్పుతున్నట్టు ప్రకటించాడు. పార్టీని పటిష్టపరిచే బాధ్యతను ఆయనకే అప్పజెప్పినట్టు జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. మరి ఇది తెలుగుదేశం అధ్యక్షుడుచంద్రబాబు నాయుడి వియ్యంకుడు, ఎన్టీఆర్ తనయుడు, సినిమా హీరో నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో జగన్ ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి బాలయ్య పర్వాలేదనే మెజారిటీతో విజయం సాధించాడు. మరి ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు చాలా హామీలే ఇచ్చాడు. ఈ విషయంలో ఇప్పటికే బాలయ్య పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విమర్శలు మొదలయ్యాయి. గెలిచినప్పటి నుంచి బాలయ్య నియోజకవర్గానికి ఏం తెచ్చి పెట్టాడు? అంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గం వరకూ నవీన్ కే పగ్గాలు అప్పజెప్పడం ఆసక్తికరంగా మారింది. బాలయ్యకు ప్రతిపక్షాన్ని తగిలించినట్టు అవుతోంది. మరి ఈ నియోజకవర్గంలో వైకాపా భవిష్యత్తులో ఎలాంటి ప్రగతి సాధిస్తుందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: