చైనా అధ్యక్షుడి మూడురోజుల పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది ! అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఆ దేశ సైనికులు కూడా మనదేశానికి వచ్చారు. ఆయనతోపాటే వెళ్ళిపోయారు. చైనాకూ, చైనాతో మనకీ ఇదేమీ కొత్తకాదు. తీర్థయాత్రలూ దండయాత్రలూ ఒకేసారి చేయగల నేర్పరి ఆ దేశం. వియ్యానికీ కయ్యానికీ మధ్య బలమైన విభజన రేఖలుండవు. ఒకపక్క సరిహద్దు ఉద్రిక్తంగా ఉండగానే, ఉభయ దేశాలూ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. భాయీ భాయీ బంధం మరింత బలపడాలని కోరుకున్నాయి. సరిహద్దు సంఘటనను అటుంచితే, చైనా అధ్యక్షుడి మూడురోజుల పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక దేశాధ్యక్షుడిని దేశరాజధాని వెలుపల స్వాగతించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. అటువంటి స్వాగతం స్వీకరించడం ఆయనకు కూడా ఇదే తొలిసారి కావచ్చు. పదమూడేళ్ళపాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ చైనా పెట్టుబడులతో ఆ దేశంతో సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్న మోదీ తన స్వరాష్ట్రంలో అతిథికి ఎర్రతివాచీ పరిచారు. సబర్మతి తీరాన సేదతీరడం, మహాత్ముని ఆశ్రమంలో చరఖా వడకడం వంటి ప్రజాసంబంధ విన్యాసాలు అటుంచితే, అభివృద్ధి చెందిన గుజరాత్‌ను అతిథి ముందు ఆవిష్కరించి మరింత మేలు చేకూర్చాలన్న లక్ష్యం కూడా నెరవేరింది. గుజరాత్‌లో చైనా పెట్టుబడుదారులు ఎలక్ర్టికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ వంటి రంగాల్లో సంస్థలు నెలకొల్పడానికి వీలుగా పారిశ్రామిక పార్కులు నిర్మించబోతున్నారు. చైనాలో అత్యంత పేరుప్రఖ్యాతులున్న గ్వాన్‌డాంగ్‌ ప్రావిన్సు-గుజరాత్‌ మధ్య సాంస్కృతిక, సామాజిక బంధాలను బలోపేతం చేసేందుకు వీలుగా సోదర హోదానిచ్చే ఒప్పందం కుదిరింది. ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో 1250 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఈ మధ్యనే మోదీ జపాన్‌లో పర్యటించి స్మార్ట్‌సిటీలు, బుల్లెట్‌ రైళ్ళు, నదుల ప్రక్షాళన ఇత్యాది అంశాల్లో ఒప్పందాలు చేసుకొని, వచ్చే ఐదేళ్ళలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు హామీ పొంది వచ్చారు. ఇప్పుడు చైనా పెట్టుబడుల హామీ అందులో దాదాపు సగం. చైనా ఇప్పటివరకూ మన దేశంలో పెట్టుబడులు పెట్టినదానితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కనుక సంతోషించాలి. అయితే, ఇప్పుడు పెట్టబోయే పెట్టుబడుల్లో అధికమొత్తం గుజరాత్‌లో కట్టబోతున్న చైనా పారిశ్రామిక పార్కులకే పోతోంది. ఇది మిగతా భారత్‌కు బాధ కలిగించకమానదు. ఇక, భారత ఎగుమతిదారులు తమ దేశంలో ఎదుర్కొంటున్న ఆంక్షలనీ, సమస్యలనీ పరిష్కరించి తగ్గుముఖం పట్టిన ద్వైపాక్షిక వాణిజ్యానికి కొత్త ఊపిరి ఇస్తానని చైనా అధ్యక్షుడు చెప్పడం కాస్తంత ఆశ కలిగిస్తోంది. తమ దేశంలోకి విదేశీ ఉత్పత్తుల దిగుమతులపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తూ భారత్‌తో భారీ వాణిజ్య మిగులు ఉన్న చైనా హామీకి అనుగుణమైన చర్యలు తీసుకుంటుందని ఆశించాలి. హైస్పీడ్‌ రైళ్ళ అభివృద్ధిలో సహకారానికి చైనా అంగీకరించడం దేశవ్యాప్తంగా ఇటువంటి రైళ్ళను సత్వరంగా ఆవిష్కరించడానికి ఉపకరిస్తుంది. వివిధ విభాగాల్లో విడిభాగాల తయారీ కేంద్రాల ఏర్పాటుకు చైనా సిద్ధపడింది. అంతరిక్ష రంగంలో సహకారానికి చైనా అంగీకరించడం దాని దృక్పథంలో వస్తున్న మార్పుకు సంకేతం. కీలకమైన ఈ రంగంలో సాంకేతిక బదలాయింపు కూడా అంతర్భాగంగా ఉండడం వల్ల పరిశోధనలకు మరింత మేలు చేకూరుతుంది. మానస సరోవరయాత్రకు ప్రత్యామ్నాయ మార్గంపై కుదిరిన అవగాహన యాత్రికుల శ్రమ తగ్గిస్తుంది. ఆ యాత్రకు మరింతమంది భక్తులు సంకల్పించేందుకు దోహదం చేస్తుంది. వివిధ ప్రాజెక్టులకు రుణసౌకర్యం కల్పించడానికి వీలుగా చైనా బ్యాంకులకూ, భారతదేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకూ మధ్య కుదిరిన ఒప్పందాలు పారిశ్రామిక ప్రగతికి ఊతాన్నిస్తాయి. అలాగే, భారతదేశంలోని టెలికమ్‌ కంపెనీలకు చైనా కంపెనీలకు మధ్య కుదిరిన ఒప్పందాలు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అగ్రనేతల పర్యటనల్లో సుహృద్భావం పొంగిపొరలుతుంది. ఆతిథ్యం ముగిసి స్వదేశానికి చేరగానే ఆవిరైపోతుంది. జింగ్‌పింగ్‌ కన్నా ముందు చైనా అధ్యక్షుడిగా ఉన్న హు జింటావో భారత్‌లో పర్యటించినప్పుడు ‘మనం ఇక ఎంతమాత్రం శత్రువులం కాదు’ అంటూ ప్రకటించారు. ఆ తరువాత ఆ మాట వాణిజ్యంలో కానీ, చొరబాట్ల విషయంలో కానీ ప్రతిఫలించలేదు. ప్రతి ఏటా చైనా నుంచి చిన్నాపెద్దా కలిపి సగటున 300లకు పైగా చొరబాట్లు జరుగుతూనే ఉంటాయని అంచనా. సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్యా ఉన్న అయోమయం, ముఖ్యంగా వాస్తవాధీనరేఖ విషయంలో ఏమాత్రం అంగీకారానికి రాని వైఖరి ఉద్రిక్తతలను పెంచుతోంది. సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులకు స్పష్టతలేనందువల్ల ఎదుటిపక్షం వారు తమ భూభాగంలోకి చొరబడ్డారన్న అనుమానం నిరంతరం కలుగుతూనే వుంది. 1996లో భారత్‌ చైనాలు సైనికరంగంలో పరస్పరం విశ్వాసాన్ని పాదుకొలిపే చర్యలు తీసుకోవాలని ఒక ఒప్పందాన్ని కుదర్చుకుంటూ సాధ్యమైనంత వేగంగా సరిహద్దులు గీసుకుని, వాస్తవాధీనరేఖ విషయంలో కూడా తమ తమ హద్దులేమిటో పరస్పరం తెలియచేసుకుని ఉద్రిక్తతలు తగ్గించుకోవాలనుకున్నాయి. ఈ పనిపూర్తికాకుండానే 2003లో ప్రత్యేక ప్రతినిధుల మధ్య చర్చలతో ఇది సుసాధ్యం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటివరకూ 17 సార్లు ఈ సమావేశాలు జరిగినా అడుగుముందుకు పడలేదు. ఆర్థిక ప్రయోజనాలకంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఆక్సాయ్‌చిన్‌ వరకూ ఈ సరిహద్దు వివాదాన్ని సాధ్యమైనంత వాడిగా వేడిగా ఉంచడం ఎదుగుతున్న భారత్‌ను నియంత్రణలో ఉంచడానికి చైనాకు అవసరం. ‘సరిహద్దుల విషయంలో స్పష్టతలేకపోవడం వల్లే అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి’ అంటూ చైనా అధ్యక్షుడు వాపోయినా, ‘ఆ స్పష్టత సాధించడానికి పునరంకితం కావాల’ని మోదీ పిలుపునిచ్చినా, సుదీర్ఘకాలంగా రగులుతున్న ఈ సమస్య సత్వరంగా పరిష్కారమవుతుందని ఆశించనక్కరలేదు. భారీ వాణిజ్య మిగులున్న చైనాకు భారత్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడానికి కానీ, అందుకు అనుగుణమైన వనరులు కల్పించి ప్రయోజనం పొందడానికి భారత్‌కు కానీ సరిహద్దులు అడ్డంకి కావు. గ్లోబల్‌ యుగంలో ఈ నీతి భారత్‌ కూడా నేర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: