ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తన కార్యకలాపాలను శనివారం విస్తృతంగా నిర్వహించింది. ఇటు ప్రభుత్వపరంగా హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథి గృహంలో ఎన్‌.చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించగా, అటు విజయవాడలో తెలుగుదేశం, బిజెపి పార్లమెంటు సభ్యులు సమావేశమై కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన సహాయ సహకారాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోవైపు హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం, తెలంగాణలో 15 ఎమ్మెల్యే స్థానాలతో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించిన తరువాత తొలిసారిగా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అత్యంత కీలకమైన విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్‌ మంగళగిరి, ఉండవల్లిలో క్షేత్రస్థాయి పర్యటనలను నిర్వహించారు. హుడా అధికారులతో కూడా చర్చించారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను స్వయంగా పరిశీలించారు.  అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చత్తీస్‌ఘర్‌ ప్రభుత్వంతో చర్చించేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు. ఆ ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. సోమవారం చత్తీస్‌ఘర్‌లో ఆయన పర్యటించనున్నారు. పోలవరం సమస్య పరిష్కారానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఒక రోడ్‌ మ్యాప్‌ను రూపొందించుకున్నారు. సకల సౌకర్యాలతో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని తీర్చిదిద్దుతామని ప్రకటించిన చంద్రబాబు, రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయన కార్యక్రమాల్లో భాగంగా చత్తీస్‌ఘర్‌ రాజధాని నయారాయపూర్‌ను కూడా ఆయన సందర్శించి అక్కడి అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రభుత్వం చేపట్టేబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. పెన్షన్లకు ఆధార్‌ను అనుసంధానం చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టనున్న పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు కార్యక్రమాలు, 24 గంటల నిరంతర విద్యుత్‌, పెన్షన్ల పెంపు తదితర అంశాలను వారికి వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమైందని స్పష్టం చేశారు. ఇక పొలిట్‌బ్యూరో సమావేశంలో జాతీయపార్టీగా తెలుగుదేశం పార్టీని మార్చే అంశంతో పాటు రెండు రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటు, పార్టీని పటిష్టం చేయటం, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం తదితర అంశాలపై చర్చించారు. విజయవాడలో జరిగిన పార్లమెంటు సభ్యుల సమావేశంలో తెలుగుదేశం, బిజెపిలకు చెందిన 21 మంది ఎంపీలు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలుపొందిన కొత్తపల్లి గీత కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ విషయమై కేంద్రంపై ఒత్తిడి తేవాలని సమావేశం నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుండి నిధులు రాబట్టడంతో పాటు లోటు బడ్జెట్‌ పూర్తికి కూడా సహకరించాలని కోరనున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు లేనప్పుడు ప్రతి నెల ఒక జిల్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశం నిర్ణయించింది. నిత్యావసర వస్తువుల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రీయ విద్యాసంస్థల్లో ప్రస్తుతం తమకున్న సీట్ల కోటాను 6 నుండి 10కి పెంచాలని, నవోదయ విద్యాలయాల్లో కూడా కోటా ఇవ్వాలని సమావేశం కోరుతూ తీర్మానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: