కాలం కలిసొచ్చింది. ఇద్దరు చంద్రుల పాలన నల్లేరుపై నడకలా సాగిపోతోంది. ఆంధ్ర, తెలంగాణల్లో విపక్షాలు పూర్తిగా చతికిలపడటంతో చంద్రబాబు, చంద్రశేఖరరావు రాజకీయంగా బలోపేతమయ్యారు. ఎన్నికలకు ముందు ఇబ్బందులు ఎదుర్కొన్నా, అధికారం చేజిక్కిన తరువాత అభివృద్ధి, సంక్షేమ వ్యూహాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఆంధ్రలో బలం ఉండీ వైకాపా, తెలంగాణలో బలోపేతం కాలేక కాంగ్రెస్ పార్టీలు.. అధికారపక్షాలను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు క్రమేపీ బలపడుతుంటే, విపక్ష పార్టీలు వ్యూహలేమి, అనైక్యత, ఆశించిన స్థాయిలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నాయి. ఇద్దరు ప్రధాన నేతలకు సమీప భవిష్యత్‌లో విపక్షం నుంచి బలమైన సవాళ్లు వచ్చే అవకాశాలు ఇసుమంత కూడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు అనేక కారణాల రీత్యా బలహీనంగా ఉన్న ఇద్దరు చంద్రులు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు, కెసిఆర్ మధ్య సయోధ్య ఉండదని, పరస్పరం విమర్శలతో కాలక్షేపం చేస్తారనే అభియోగాలకు తావులేకుండా ఇద్దరు నేతలు సంయమనంతో ముందడుగు వేయడం విశేషం. తొలి నెల రోజుల్లో విద్యుత్, పోలవరం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నా, ప్రస్తుతానికి ఈ సమస్యలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. పాలనా వ్యవహారాల్లో సిఎం చంద్రబాబు బిజీ కావడంతో, కుమారుడు లోకేష్ తెరవెనక నుంచి పార్టీ వ్యవహారాలు చక్కబెడుతూ దన్నుగా నిలుస్తున్నారు. కీలకమైన అంశాల్లో పార్టీకి దిశ, దశ నిర్దేశిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ సిఎం కెసిఆర్‌కు కుమారుడు, మంత్రి కె తారకరామారావు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షణం తీరికలేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ తండ్రికి దన్నుగా నిలవడం గమనార్హం. కెసిఆర్ కుటుంబ పాలన రాష్ట్రంలో సాగుతోందనే విమర్శలను పక్కనపెట్టి గత పదిహేనేళ్ల ఉద్యమకాలంలో అండగా ఉన్న కుమారుడు కెటిఆర్, మేనల్లుడు హరీశ్‌రావు పాలనలో భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి. సుదీర్ఘకాలం ఉద్యమంలో ఉండి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వంపైనా పట్టు సాధించారు. అన్ని శాఖలను క్రమం తప్పకుండా సమీక్షించి, లోపాలను గుర్తించి బ్యూరోక్రసీని నడిపిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడేందుకు పారిశ్రామిక, ఐటి విధానాలను సరళీకరించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులు, ప్రోత్సహకాలు ఇస్తామని ప్రకటించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారు. కెసిఆర్ పని విధానం, చకాచకా ఫైళ్ల క్లియరెన్సు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్న తీరు, సంక్షేమ విధానాలపై స్పష్టత చూసి విపక్షాలతోపాటు, బ్యూరోక్రసీ విస్తుపోతోంది. రైతుల రుణమాఫీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అవాంతరాలు ఎదురవుతున్నా రాజీలేకుండా ముందడుగు వేస్తున్నారు. చంద్రబాబు ముందు వచ్చే వంద రోజుల్లో అనేక సవాళ్లు ఉన్నాయి. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించారు. అక్కడకు దశలవారీగా కనీసం కొన్ని ప్రభుత్వ శాఖలను తరలించాల్సి ఉంది. తాను కూడా విజయవాడలోనే ప్రతివారంలో ఎక్కువ రోజులు ఉంటానని చెప్పిన మాటను బాబు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ హెల్త్ కార్డులు తదితర స్కీంలను ప్రవేశపెట్టనున్నారు. పెన్షన్లను పెంచనున్నారు. ఇవన్నీ కత్తిమీద సాములాంటివే. హీరో ప్రాజెక్టును తీసుకురావడం, విద్యుత్ రంగంలో అందరికీ విద్యుత్, ఎంపిక చేసిన ప్రాంతాల్లో అక్టోబర్ 2నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీలు సాకారం చేసేందుకు చంద్రబాబు తలమునకలై ఉన్నారు. మంత్రి పి నారాయణ, రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి, రిటైర్డు ఐఏఎస్ అధికారి సాంబశివరావు సహాయంతో కుమారుడు లోకేష్ పార్టీని చాకచక్యంగా నడిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైకాపా ఆశించిన రీతిలో వ్యూహాలతో ముందుకు రాలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షనేత జగన్‌పై ఉన్న కేసులతో ఆయన తండ్రి దివంగత వైఎస్ మాదిరిగా పాలకపక్షంపై తీవ్రమైన ఎదురుదాడి చేయడంలేదనే అపవాదుంది. 67మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నా, తెలియని నైరాశ్యం ఆ పార్టీ వర్గాల్లో ఆవరించింది. అక్టోబర్ నుంచి రైతు రుణమాఫీపై ఉద్యమిస్తామని వైకాపా ప్రకటించింది. ఈ పార్టీ చేపట్టే ప్రజాందోళనల తీరు, ప్రజల స్పందన కోసం వేచిచూడాల్సిందే. నందిగామ ఉప ఎన్నికలో తెదేపా ఘన విజయం ఆ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పట్లో లేచే పరిస్ధితి కనపడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: