ఇప్పటికే టిడిపిలో చక్రం తిప్పుతున్న లోకేశ్‌ మరింత క్రియాశీలం కానున్నారు. అధికారికంగా వారసత్వ బాధ్యతలను ఆయనకు అప్పగించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు అనధికారికంగా పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్న లోకేశ్‌కు పార్టీ బాధ్యతలను అప్పగించడానికి బాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ బాధ్యతలను లోకేశ్‌కు ఇప్పటికే బాబు అప్పగించారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. రానున్న మహానాడులోనో, ఈ లోగానో ఆ దిశలో అధికారిక ప్రకటన చేయడమే మిగిలి ఉందని వర్గాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలోనే టిడిపిలో ఇప్పటివరకు కీలక బాధ్యతలు నిర్వహించిన పలువురు తెర వెనక్కి పోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రుల కార్యాలయాల్లో మీడియా లైజాన్‌ ఆఫీసర్ల నియమాకం వంటి అంశాలను సైతం నిర్ధేశిస్తున్న లోకేశ్‌ పూర్తిగా తనకు అనుకూలమైన వారినే కోర్‌టీమ్‌గా ఎంచుకుంటారన్న అభిప్రాయం వినవస్తోంది. దీనికి తగ్గట్టుగానే టిడిపిలో సీనియర్‌ నాయకులైన యనమల రామకృష్ణుడు వంటి మంత్రులకు సైతం చంద్రబాబు తక్కువ గ్రేడ్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో భాగంగానే టిడిపిలో క్రీయాశీలకంగా వ్యవహారించిన సిఎం రమేష్‌, నామా నాగేశ్వరరావు, గరికపాటి రామ్మోహనరావు వంటి నాయకులు పూర్తిగా తెరమరగయ్యే అవకాశం ఉందని సమాచారం. వీరికి బదులుగా కొత్త కోటరీలో రాజ్యసభ సభ్యుడు సుజన చౌదరి, రాష్ట్ర పురపాలన శాఖ మంత్రి పి. నారాయణ, మాజీ ఐఎఎస్‌ అధికారి ఎం సాంబశివరావు కీలక బాధ్యతలు పోషించనున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. వీరి చుట్టే దేశం రాజకీయాలు కేంద్రీకృతం అవుతున్నాయి. తెలంగాణ నుండి రేవంత్‌రెడ్డికి కోటరీలో స్థానం దక్కనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిఎం రమేష్‌ కీలక పాత్ర పోషించినప్పటికీ భవిష్యత్‌లో ఆయన పాత్ర రాయలసీమ జిల్లాలకే పరిమితం కానుంది. సుజనచౌదరికి క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించడమే దీనికి కారణం. రాష్ట్ర రాజధానికి సంబందించిన ఆర్థిక వనరుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న సుజన చౌదరి, చంద్రబాబునాయుడి కుటుంబానికి ముఖ్యంగా లోకేశ్‌కు సన్నిహితుడు. ఇక గత ఎన్నికల్లో టిడిపి విజయంలో కీలకపాత్ర పోషించిన విద్యాసంస్థల అధినేత పి. నారాయణ కూడా కొత్త కోటరీలో కీలకబాధ్యతలు అప్పగిస్తున్నారు.  ఉభయ సభల్లో దేనికి ఎన్నిక కాకపోయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కడంతో పాటు, పలు మంత్రివర్గ ఉపసంఘాలకు ఆయన అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. టిడిపిలో నారాయణ కు లభిస్తున్న ప్రాధాన్యతకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. 1996నుండి 2004 వరకు సిఎం పేషీలో కీలకబాధ్యతలు నిర్వహించి, ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసిన హెరిటేజ్‌ సంస్థలో సిఇఓగా చేరిన మాజీ ఐఎఎస్‌ అధికారి ఎం. సాంబశివరావు ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబుకు సలహాలిస్తున్నారు. తాజాగా సిఎం పేషీలో పలువురు కీలక అధికారుల నియమాకం వెనుక ఆయన ఆలోచనలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే అంతర్గతంగా కీలక పాత్ర పోషిస్తున్న వీరు రానున్న రోజుల్లో మరింతగా ప్రాధాన్యతనంతరించుకోనున్నారని సమాచారం. అయితే, ఈ పరిణామం టిడిపి సీనియర్‌ నేతల్లో అసంతృప్తికి దారి తీస్తోంది. బాహటంగా మాట్లాడకపోయినప్పటికీ, అంతర్గత చర్చల్లో ఈ విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: