రాయలసీమకు జరుగుతున్న అన్యాయం దృష్ట్యా.. ఆ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయడమే మంచి పరిష్కారం అని అంటున్నారు ఆ ప్రాంత వాసులు. తాజాగా కర్నూలులో రాయలసీమ విద్యార్థి సంఘం సమావేశమై.. ప్రత్యేక కాంక్షను వెలిబుచ్చింది. ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి జై కొట్టింది. ఇక ఈ డిమాండ్ పై విస్తృతమైన ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. రాయలసీమకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని ప్రత్యేక ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏ రూపు రేఖల్లో ఉండినా.. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా.. రాయలసీమకు జరిగింది మాత్రం ద్రోహమేనని వారు అన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి.. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దగ్గర నుంచి రాయలసీమను చిన్నచూపే చూస్తున్నారని..ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో రాజధానిని కర్నూలు నుంచి తరలించడం సగం అన్యాయం అని.. ఇతర వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేసి.. రాయలసీమకు అన్యాయం చేశారని విద్యార్థులు అన్నారు. ఇప్పుడు కూడా అది కొనసాగుతోందని.. సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ లో రాజధానిని రాయలసీమకే ఇవ్వాల్సిందని.. అయితే అది జరగలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు రాజధాని కావాలని.. అయితే ప్రభుత్వం మాత్రం విజయవాడను రాజధానిగా ప్రకటించిందని.. ఇది రాయలసీమకు జరిగిన మరో అన్యాయమని విద్యార్థులు అందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్యాయాలను ఇక సహించేది లేదని ప్రత్యేక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలో రాయలసీమ అంతా బస్సుయాత్రను కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. మరి విద్యార్థులు ఈ విధంగా గర్జించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఉద్యమం ఎలాంటి పుంతలు తొక్కుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: