కొన్ని విషయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఒకే బాటలో నడుస్తున్నారు. ఆయనేం చేస్తే ఈయనా అదే చేస్తున్నాడు.. ఈయనేం చేస్తే ఆయనా అదే చేస్తున్నాడనే పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ఆదర్శరైతు పథకాన్ని రద్దు చేసింది. కాంగ్రెస్ హయంలో ఏర్పాటైన ఈ వ్యవస్థ ఆ పార్టీ కార్యకర్తలకే ఉపయోగపడిందని చంద్రబాబు ఫీలయ్యారు. అనుకున్నదే తడవుగా ఆదర్శరైతు వ్యవస్థను ఎత్తేశారు. దీనిస్థానంలో.... వ్యవసాయ విస్తరణ అధికారుల వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. రేపే మాపో ఆదర్శరైతును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఆదర్శరైతు విషయంలోనే కాదు... రుణమాఫీ విషయంలోనూ రెండు సర్కార్లు పిల్లిమొగ్గలే వేస్తున్నాయి. ఇద్దరూ ఇదిగో అదిగో అంటూ కాలం గడిపేస్తున్నారే కానీ.. అన్నదాతకు నేరుగా ఉపశమనం కలిగించే ప్రయత్నాలు అంతగా సాగడం లేదు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కేవలం రుణమాఫీ అంశంపై తప్ప ఇతర ఎన్నకల హామీలపై పెద్గగా దృష్టిసారించడంలేదు. కొన్ని విషయాల్లో ఇద్దరి దారులు వేరైనా.. ఇలాంటి చాలా విషయాల్లో బాబును కేసీఆర్... కేసీఆర్ ను బాబు ఫాలో అవుతున్నారన్నమాట. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఓకే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సమగ్రసర్వే పేరుతో లబ్దిదారుల్లో నిజమైనవారిని గుర్తించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఒకే రోజు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించి... రికార్డులు తయారు చేస్తున్నారు. చంద్రబాబు ఆ స్థాయిలో చేయకపోయినా.. లబ్దిదారుల్లో నకిలీలను ఏరి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఫించన్ల విషయంలో జాగ్రత్తపడుతున్నారు. అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు. కమిటీలు వేసి అనర్హులను ఏరివేస్తున్నారు. కాస్తా కూస్తో అటూ ఇటూగా చంద్రుల పాలన ఒకే గాడిలో సాగుతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: