మజ్లిస్.. పాతబస్తీకే పరిమితమైన ఈ పార్టీ ఈసారి నగరం వెలుపలా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఏకంగా తెలుగునేల దాటి మహారాష్ట్రలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలని తహతహలాడుతోంది. ముస్లింల వాయిస్ గా పేరుబడిన ఈసారి ఎలాగైనా.. మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టాలని కృషి చేస్తోంది. ఇప్పటికే వారం రోజుల్లో ముంబైలోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వారం రోజులుగా ముంబైలోనే మకాం వేశారు. ముస్లింలకు సంబంధించిన ధార్మిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోనూ భేటీ అవుతూ మద్దతు కూడగడుతున్నారు. ముంబైతో పాటు షోలాపూర్ లోనూ బహిరంగసభలు నిర్వహించింది. నాందేడ్, ఔరంగాబాద్ లలోనూ భారీ సభలకు ప్లాన్ చేస్తోంది. ఐతే మజ్లిస్ మహారాష్ట్ర ఎన్నికల బరిలో దిగడం ఇదే కొత్త కాదు. రెండేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. 15చోట్ల కౌన్సిలర్ లను గెలిపించుకుంది. నాందేడ్, పరభరీ, జాల్ నా, ఔరంగాబాద్ వంటి ప్రాంతాల్లో మజ్లిస్ చెప్పుకోదగిన స్థాయిలో పట్టు సంపాదించింది. ఈసారి విదర్భ, మరాఠ్వాడాలతో పాటు ముంబై వంటి ప్రాంతాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు అసదుద్దీన్, అక్బరుద్దీన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ పూర్వీకులది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఔసా ప్రాంతం. ఈసారి ఆ ప్రాంతం నుంచి అసెంబ్లీలో మజ్లిస్ ప్రాతినిథ్యం ఉండాలని అసద్ మంచి పట్టుదలతో ఉన్నారు. వచ్చేనెల 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగాలని యోచిస్తోంది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు దళితులు, వెనుకబడినవారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ బరిలో దిగాలని యోచిస్తోంది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి అసదుద్దీన్ సోదరుల ఈ ఆపరేషన్ మహారాష్ట్ర ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: