రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫి చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకుగాను తొలివిడతగా రూ.4250 కోట్లు విడుదల చేశారు. ఈ నెలాఖరు లోపు కొత్త రుణాలు పొందకుంటే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే వెంటనే నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీకి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రికి అందజేసింది. నివేదికలోని మంత్రుల సిఫారసులను పరిశీలించిన ముఖ్యమంత్రి వెంటనే వాటికి ఆమోదం తెలుపుతూ రూ.4250 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులు ఎంతో ఊరట చెందుతారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకులు రైతుల రుణాలు రెన్యువల్‌ చేస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా రుణమాఫీ వర్తించకుంటే అక్టోబర్‌ నెలలో రైతులపై 12 శాతం అపరాధ రుసుం పడేదని, ఇప్పుడు ఆ ప్రమాదం తప్పిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి డా.టి.రాజయ్య, మంత్రులు టి.హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: