ప్రభుత్వాలు మారి కొత్త ప్రభుత్వాలు వస్తున్నా.. రైతులపై చిన్నచూపు పోవడం లేదు. అన్నదాతకు సాయం చేయకపోవడమే కాదు.. వారికి ఆర్థికంగా సహకరిస్తున్న సహకార సంఘాలను ఎత్తేయాలని కేంద్రం దృష్టి సారిస్తోంది. UPA ప్రభుత్వం నియమించిన ప్రకాశ్‌బక్షీ కమిటీ సిఫార్సులను ఇప్పుడు NDA సర్కార్‌ అమలు చేయాలని చూస్తోంది. రైతు సంఘాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సహకార సంఘాలు అన్నదాతలతో ఎంతగానో పెనవేసుకుని ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా రైతుల ఆర్థిక అవసరాలను తీరుస్తున్నాయి. సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు లాంటి అవసరాలు సమకూరుస్తున్నాయి. 2004 కంటే ముందున్న ప్రభుత్వాలు సహాకార రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఓ దశలో ప్రాథమిక సహాకార సంఘాలు అంపశయ్యపై ఉన్నాయి. రైతు సంఘాలు, వామపక్షాల ఒత్తిడి మేరకు 2004 ఆగస్టులో నాటి యుపిఎ ప్రభుత్వం వైద్యనాథన్ కమిటీ వేసింది. కమిటీ సిఫార్సుల మేరకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా 17 రాష్ట్రాల్లోని 53వేల సహాకార సంఘాలకు 9 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో సంఘాలు ఆర్థికంగా పురోగమిస్తున్న దశలో యుపిఎ-2 ప్రభుత్వమే సహాకార సంఘాల ఖర్చు తగ్గించడం, లాభాల్లోకి తీసుకురావడానికి సలహాలు ఇవ్వాల్సిందిగా 2012 జూలైలో నాబార్డ్ ఛైర్మన్ ప్రకాశ్ బక్షీ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. సహాకార వ్యవస్థను అధ్యయనం చేసిన ప్రకాశ్‌ బక్షీ కమిటీ 2013 జనవరిలో దేశంలోని వ్యవసాయ సహాకార సంఘాలను భక్షించే విధమైన సిఫార్సులతో నివేదికను ఇచ్చింది. దేశంలోని ప్రాథమిక సహకార సంఘాలను రద్దు చేసి, వాటి ఆస్తులు.. అప్పులను కేంద్ర సహాకార బ్యాంకుకు బదిలీ చేయాలని పేర్కొంది. అంతేకాదు.. ప్రాథమిక సహాకార సంఘాలన్నీ రైతులకు అప్పులివ్వడం మానేసి.. కేంద్ర సహాకార బ్యాంకులకు కేవలం బిజినెస్ కరస్పాండెంట్‌లుగా ఉండాలని చెప్పింది. అయినా సహాకార బ్యాంకుల వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశం. ఐతే కేంద్రం మాత్రం బక్షీ కమిటీ సిఫార్సుల పేరుతో బలవంతంగా పెత్తనం చేయాలని చూస్తోంది.  గత యుపిఎ హయాంలోనే బక్షీ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు. దీంతో దేశవ్యాప్తంగా రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎక్కడికక్కడ రైతు సంఘాలు ఆందోళనలు చేయడంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బక్షీ సిఫార్సులను వాయిదా వేశారు. ఇప్పుడు UPA దారిలోనే NDA ప్రభుత్వం నడవాలని చూస్తోంది. బక్షీ కమిటీ సిఫార్సుల దుమ్ము దులపాలని చూస్తోంది. దీనిపై రైతు సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. రైతుకు సహయం అందించకుండా.. సర్కారు తన బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాకుండా.. వారికి ఆసరాగా నిలుస్తున్న వ్యవసాయ పరపతి సహకార సంఘాలను మూసేయాలని చూస్తుండడం ఎంత వరకు సమంజసం. సహాకార వ్యవస్థకు వినాశకారిగా ఉన్న ప్రకాశ బక్షీ సిఫార్సులను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని రైతుల సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: