తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈమేరకు పార్టీ నాయకత్వంతో మంతనాలు సైతం పూర్తిచేసినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి ఎర్రబెల్లి గన్‌మెన్‌ కూడా లేకుండా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికార నివాసానికి వెళ్ళి రెండు గంటలపాటు చర్చలు జరిపారు. చాలాకాలంగా ఎర్రబెల్లి తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలో చేరుతున్నారనే ప్రచారం కొనసాగింది. అయితే తాను కేసీఆర్‌ నివాసానికి వెళ్ళలేదని, ఆయనతో చర్చలు జరపలేదని తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం త్వరలో తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లు సమాచారం. మెట్రో రైలు ప్రాజెక్టకు రాయదుర్గం వద్ద 15 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఆ భూమిని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన వెంటనే 'మై హోమ్స్‌' సంస్థ అధినేత రామేశ్వరరావుకు బదలాయించారనే అంశం వివాదాస్పదంగా మారింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ భూమిని రామేశ్వరరావుకు కేటాయించాలంటూ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి, తెరాస నాయకులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు వంటివారు డిమాండ్‌ చేసి శాసనసభలో సీఎం కార్యాలయం ముందు ధర్నా కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో తెరాస అధికారంలోకి రాగానే ఆ భూమిని మైహోమ్స్‌కు బదలాయించిందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఈ విషయంలో తెలుగుదేశం పార్టీలో పెద్దయెత్తున చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుటే ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిలు వాదులాడుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు రేవంత్‌రెడ్డికే మద్దతు పలికాడని భావించిన ఎర్రబెల్లి పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ఎర్రబెల్లి తీరుపై పెదవి విరచినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా రేవంత్‌రెడ్డిని నియమించడాన్ని కూడా ఎర్రబెల్లి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయినా చంద్రబాబు పొలిట్‌బ్యూరోలోకి రేవంత్‌రెడ్డిని తీసుకున్నారు. దీంతో మరింత అసహనానికి గురైన ఎర్రబెల్లి పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం నేత రేవంత్‌రెడ్డి మెట్రో రైలు భూ వ్యవహారంపై మాట్లాడినప్పుడల్లా దొరల పాలన అంటూ కేసీఆర్‌, ఎర్రబెల్లిల సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. దీనిపై ఎర్రబెల్లి మరింత ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. చివరకు తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: