కేసీఆర్ పాలనపై అన్ని వైపుల నుంచి విమర్సలు పెరుగుతున్నాయి. విపక్షాలకు తోడు ఇప్పుడు నక్సల్స్ సానుభూతిపరులు కూడా కేసీఆర్ ను దుయ్యబట్టడం ప్రారంభించారు. మొన్న వారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సభను అడ్డుకున్న నేపథ్యంలో కేసీఆర్ పై వారు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్ వరవరరావు ఏకంగా కేసీఆర్ ను నియంతగా వర్ణించారు. ఎమర్జన్సీ కాలం కంటే చీకటి రోజులను కేసీఆర్ పాలన తలపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ డీఎన్ఏలోనే ప్రజాస్వామ్య ఆకాంక్ష ఎక్కువగా ఉందని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మావోయిస్టులతో చర్చలు జరిపిన చరిత్ర తెలంగాణకు ఉందని.. ఇప్పుడు కేసీఆర్ అసలు చర్చలే జరగనివ్వకపోవడం అప్రజాస్వామ్యికమని ప్రోఫెసర్ హరగోపాల్ విమర్శించారు. తరచూ.. కాళోజీ, జయశంకర్ వారసత్వాన్ని ప్రస్తావించే కేసీఆర్... సభలను ఎలా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రాంతంలో ఎలాంటి నిర్బంధం లేకుండానే సదస్సులు నిర్వహించామని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రతినిధులు గుర్తు చేశారు. కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రతినిధులు.. మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని మావోయిస్టులే అందిస్తారని తెలిపారు. అందుకు ఉదాహరణగా దండకారణ్యంలో నెలకొన్న జనతన సర్కార్ ను చూపారు. తమ సభ జరిగితే.. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని కేసీఆర్ భయపడుతున్నారని వరవరరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు కనీసం సభ జరుపుకునేందుకు కూడా అంగీకరించకపోవడం నియంత లక్షణమేనని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: