కాషాయకూటమికి బీటలు వారిన మరుసటి రోజే బిజెపిపై శివసేన నిప్పులు చెరిగింది. మహారాష్ట్రకు శత్రువుగా బిజెపిని అభివర్ణించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అసలు సిసలైన మరాఠీ అనుకూల అజెండాను నెత్తికెత్తుకునేలా సంకేతాలు ఇచ్చింది. 'మా ఇతర(మహాయుతి) కూటమి భాగస్వామ్యపార్టీలు సేన-బిజెపి అనుబంధం కొనసాగాలని కోరుకున్నాయి. దీనికన్నా మరింత ఎక్కువగా 11 కోట్ల మహారాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. అటు మిత్ర పక్షాలు, ఇటు 11 కోట్ల ప్రజానీకం ఆకాంక్షలు నెరవేరకూడ దని మహారాష్ట్ర శత్రువులు(బిజెపి) భావించారు' అని శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆక్రోశం వెల్లగ క్కింది. 'కూటమికి బీటలు వారేలా చేయడం సంయుక్త మహా రాష్ట్ర ఉద్యమంలో అమరులైన 105 మందిని అవమానించడ మే'నని సంపాదకీయం విమర్శించింది. ఒకేసిద్ధాంతం గల హిందూత్వ అనుకూల పార్టీలు రెండు విడిపోవడం దురదృ ష్టకరమని వ్యాఖ్యానించింది. 25 ఏళ్ల బంధం తెగతెంపులు బాధాకరమని పేర్కొన్నది. 'హిందూత్వ సిద్ధాంతానికి కట్టుబడి వుండటం ద్వారా బిజెపి-శివసేన పార్టీలు 25 ఏళ్లుగా కలిసి వుంటున్నాయి. ఈ బంధం విడిపోవడం విచారకరం. బిజెపి, మహాయుతిలోని ఇతర పార్టీలతో కలిసి వుండేందుకు చివరి వరకు మేము చిత్తశుద్ధితో ప్రయత్నించాం. కూటమి చెల్లాచె దురు కాకూడదనే మేము గట్టిగా కోరుకున్నాం' అని సంపాదకీయంలో శివసేన మొసలికన్నీరు కార్చింది. 'పొత్తులు విచ్ఛిన్నం కాకూడదని నిన్నటి వరకు ఇక్కడ ఒక గుడారంలో పూజలు చేశాం. మరో గుడారంలో నమాజ్‌ చేశాం' అని భారతీయ ముస్లింల దేశభక్తిని కీర్తిస్తూ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మోడీయే లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. మహారాష్ట్ర ప్రతిష్టను దిగ జార్చేందుకు బిజెపి కంకణం కట్టుకున్నదని శివసేన మండి పడింది. ముంబయి ప్రాధాన్యతను తగ్గించడానికి దేశ ఆర్థిక రాజధాని నుండి ఆర్‌బిఐ ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ డివిజన్‌ను ఢిల్లీకి మార్చేందుకు బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నారాయణ్‌ రాణె ఇటీవల చేసిన ఆరోపణలను సంపాదకీయం ప్రస్తావించింది. రాష్ట్ర ప్రాధాన్యత తగ్గిపోతుందని కాంగ్రెస్‌ నాయకులు నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మొరార్జీ దేశారు హయాంలో కాంగ్రెస్‌ రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది కాదా' అంటూ నిలదీసింది. మురార్జీ దేశారు ముఖ్యమంత్రిగా వుండగా సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం కార్యకర్తలు 105 మందిని దారుణంగా కాల్చిచంపారు. బోంబే రాజధానిగా మరాఠీ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నాడు జరిగిన సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఆరోపించింది. ముంబయి, మహారాష్ట్ర భవిష్యత్‌ గురించి కాంగ్రెస్‌ పార్టీ, దాని నాయకులకు ఆందోళన అవసరం లేదని, శివసేన వున్నంత వరకూ కాషాయజెండా మహారాష్ట్రను కాపాడుతుందని సామ్నా పేర్కొన్నది. కాషాయ కూటమి, కాంగ్రెస్‌-ఎన్‌సిపి మధ్య పొత్తులు విచ్ఛిన్నం కావడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ జరిగే అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర జీవితంలో అమావాస్య తొలగిపోతుంది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వ్యాఖ్యానించింది. కాగా, కాషాయ కూటమి పొత్తులు విచ్ఛిన్నంపై శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే స్పందించలేదు. శనివారం ముంబయిలో జరిగే బహిరంగ సభలో తన అభిప్రాయాలను ప్రజల ముందుంచుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: