నూతన రాజధానికి కావాల్సిన భూమి కోసం ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రాజధాని సలహా కమిటీతో సమావేశమైన చంద్రబాబు భూ సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. అందుబాటులో 11వేల ఎకరాలు ఉన్నా.. దాంట్లో నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఉపయోగమని సీఎంకు దృష్టికి వచ్చింది. భూ సేకరణలో రైతులను భాగస్వాములను చేస్తూనే.. లాండ్‌ పూలింగ్‌ విధానం అనుసరించాలని సర్కార్‌ భావిస్తోంది. శుక్రవారం కూడా మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది. నూతన రాజధాని నిర్మాణానికి ల్యాండ్‌ ప్రధానం. ఇందుకోసం ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. రాజధాని సలహా కమిటీతోచంద్రబాబు భూ సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రెండు జిల్లాల్లో దాదాపు 11 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అయితే కాల్వలు, అడవులు మినహాయించి.. నాలుగువేల ఎకరాలు మాత్రమే రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉందని కలెక్టర్లు సీఎంకు నివేదించినట్లు సమాచారం. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. రైతులను భాగస్వాములను చేస్తూ.. ఆకర్షణీయమైన విధానం తీసుకురావాలని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్న రైతులు.. లాండ్‌ పూలింగ్‌పై స్పష్టమైన విధానం కోరుతున్నారని కమిటీ సభ్యులు చంద్రబాబుకు వివరించారు. రైతులను పరిగణలోకి తీసుకుని వారికి మేలు జరిగేలా పూలింగ్‌ విధానం ఉండాలని సీఎం భావిస్తున్నారు. అది ఏ నిష్పత్తిలో ఉండాలి.. ఏ విధానం అనుసరించాలో మంత్రి వర్గ ఉప సంఘం ఖరారు చేస్తుందని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ర్టాల్లో సేకరించిన భూ విధానంలో ఉన్న అనుకూలతలను ఇక్కడ అమలు చేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతంలో ఎంత మేర భూమి సేకరించాలనే దానిపై చర్చ సాగింది. రాజధాని సలహా కమిటీ మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశముంది. సీఎం సూచనల మేరకు రైతులతో సమావేశమై.. లాండ్‌ పూలింగ్‌పై నివేదిక సమర్పించనుంది. తర్వాత విధి విధానాలు ఖరారు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: