దక్షణాధిన పాగా వేయాలని ఉవ్విళ్లూగుతున్న బిజెపికి కాలం కలిసొస్తుందా....? రాయలసీమలో నామమాత్రపు ఉనికి ఉన్న ఆ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయా...? రాయలసీమ ప్రాంతం నుంచి బలమైన నేతగా పేరును కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇటీవల బిజెపి తీర్థం పుచ్చుకొన్న విషయం తెలిసిందే. కోస్తాంధ్రలో కావూరి సాంబశివరావు, పురందేశ్వీరి వంటి నేతలు కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు. వారి ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని బిజెపికి కొత్త జలసత్వాలు వస్తాయా అన్న చర్చ ప్రాంభమైంది. అయితే ఈ చేరికల ముచ్చట ముడునాళ్లుగా మిగిలిపోతుందా అని కూడా చర్చ సాగుతోంది. కారణం గతంలో రాయలసీమ ప్రాంతం నుంచి బలమైన నేతగా పేరున్న గంగుల ప్రతాపరెడ్డి సైతం బిజెపిలో చేరారు. కానీ ఆయన సుధీర్ఘకాలం ఆ పార్టీలో కొనసాగలేక పోయారు. తిరిగి తన మాతృపార్టీ అయినా కాంగ్రెస్‌లో చేరి పోయారు. ఇదే పరిస్థితులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విషయంలో పునరావృతం కాకూడదని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుంటే బిజెపిలో చేరిన పురందేశ్వరీ ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసే నేతలు వస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ రాషా్టన్రికి చెందిన బిజెపి నేతలు పేర్కొంటున్నారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి రాకను ఆహ్వానిస్తున్న రాయలసీమ కమలం నేతలు ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని కోరుతున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉంటుందా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ బిజెపికి బలమైన నాయకత్వం తయారవుతోందన్న ప్రచారం నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని వీడిన పురందేశ్వరీ దంపతులు బిజెపి తీర్థం పుచ్చుకొన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ తరపున పోటీకూడా చేశారు. కానీ విజయం సాధించలేదు. అయితే విశాఖ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఈ పురందేశ్వరీ దంపుతుల ప్రాబల్యం ఉంది. ప్రస్తుతం రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లా నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా వెంకయ్యనాయుడు సమక్షంలో బిజెపి తీర్థంపుచ్చుకొన్నారు. నరేంద్రమోదీ విధానాలు తనకు నచ్చాయని, అందుకే బిజెపిలో చేరానని ఆయన వెల్లడించారు. దీంతో కర్నూలులోనూ బిజెపికి ప్రాబల్యం పెరుగుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి గౌరు చరిత చేతిలో ఆయన ఓడిపోయారు. కానీ ఆయన సుధీర్ఘకాలం బిజెపిలో కొనసాగుతారా ప్రస్తుతం ఆయన బిజెపిలో చేరడం వెనక కారణాలు ఏమిటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నందునే ఈ చేరికలు సాగుతున్నాయా అన్న చర్చ కూడా బిజెపిలోనే సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలతో భిన్న వైరుద్యాలు ఉన్న బిజెపిలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఏమేర ఇమడ గలుగుతారు అన్న చర్చ ప్రారంభమైంది. బిజెపి కొన్ని ప్రత్యేక సిద్దాంతాలు, నిబంధనలు ఉన్న పార్టీ. ఈ పార్టీపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం ఎక్కువ అని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి.  వీటన్నింటిని ఏమేర ఎదుర్కొని బిజెపిలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి నిలదొక్కుకొంటారు అన్న చర్చ సాగుతోంది. గతంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ కేంద్రంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రతాపరెడ్డి సైతం బిజెపిలో చేరారు. కానీ 2004 ఎన్నికలకు ముందు బిజెపిని వీడి ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కేవలం అధికారంలో బిజెపి ఉన్న సమయంలోనే ఇలాంటి నేతలు వస్తుంటారన్న విమర్శలు ఆ పార్టీలో వెల్లువెత్తాయి. ఇలాంటి వారికి పార్టీలో అందలం ఎక్కించకూడదన్న చర్చ కూడా నాడు సాగింది. అయితే ప్రస్తుతం కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేరికతో బిజెపి శ్రేణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అయితే బిజెపిని నమ్ముకొని పార్టీ బలోపేతానికి కాటసాని రాంభూపాల్‌రెడ్డి కృషిచేయాలని వారు కోరుతున్నారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ గతంలో కంటే ప్రస్తుతం జనంలో చరిష్మా ఉన్న నేతలు బిజెపిలో చేరడం పట్ల ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. పురందేశ్వరీ దంపతుల రాక, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేరికతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు ఆశిస్తున్నారు. మరోవైపు పురందేశ్వరీ దంపతులు బిజెపిని వీడనున్నారు అన్న ప్రచారం కూడా ఊపందుకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: