కృష్ణాజిల్లా మూడు హత్యల కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇప్పటికే నిందితుల వివరాలు, హత్యలకు గల కారణాలను గుర్తించిన పోలీసులు.. 20 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరికొన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. ఏలూరు రేంజ్‌ పరిధిలోకి వచ్చే విజయవాడ కమిషనరేట్‌, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ ఆధారాలను సేకరించారు. ఇప్పటికే నిందితులు బస చేసిన ప్రాంతాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా హత్యకు మొత్తం ఆరుగురు స్ధానికులు కుట్ర పన్నినట్లు నిర్ధరించారు. హత్యల తర్వాత హనుమాన్ జంక్షన్‌లోని రాయలహంపి లాడ్జ్‌కి వెళ్లిన నిందితులు స్నానాలు చేసి రెండు కార్లలో రాజమండ్రికి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యలో భీమడోలు వద్ద నిందితుల కారు టైరు పంక్చర్ కాగా ...స్వయంగా వారే స్టెప్నీ మార్చుకొని వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. విశాఖపట్నం వెళ్లేందుకు కార్లను తీసుకున్న నిందితులు రాజమండ్రి రైల్వేస్టేషన్ దగ్గర దిగి కారు డ్రైవర్లకు 1700 రూపాయలు చెల్లించినట్లు తెలిసింది. హత్యలకు సహకరించినట్లుగా భావిస్తున్న 15 మంది అనుమానితుల్ని పశ్చిమగోదావరిజిల్లా పినకడిమి, ఏలూరుల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులు, కుట్రదారులు, కిరాయి హంతకుల్ని గుర్తించే ప్రయత్నాలు సాగుతున్నాయని పోలీసులు తెలిపారు. నిందితుల స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పినకడిమిలో 12 గంటలపాటు 20 బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. హత్యలు జరిగిన ఉంగుటూరు మండలం పెదవుటపల్లితో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఆధారాల వేట సాగుతోంది. హనుమాన్ జంక్షన్‌లోని రాయల హంపి లాడ్జిలో నిందితుల నుంచి ఎలాంటి వివరాలు తీసుకోకుండా ....వారికి గదులు కేటాయించారు. దీనిపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: