కొత్త రాష్ట్రం తెలంగాణ ఐనా... అన్నీ కొత్తగా కట్టుకోవాల్సిన పరిస్థితి ఏపీది. అందుకే అంతా అంచనాలు.. లెక్కల్లో బిజీగా ఉన్నారు. ఏ విభాగం సంగతి చూసినా ఇదే పరిస్థితి. కొత్త కార్యాలయాలెక్కడ.. అందుకు ఎంత స్థలం కావాలి.. ఎన్ని ఎకరాలు కావాలి ఇదే చర్చలు..పోలీసుల విషయానికి వస్తే... కోటి చదరపు అడుగుల భూమి కొత్త కార్యాలయాల నిర్మాణం కోసం అవసరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం అంచనాకు వచ్చింది. పోలీసు ప్రధాన కార్యాలయం, తమ శాఖలోని ఇతర విభాగాలను ఏర్పాటు చేసుకునేందుకు మూడు వేల ఎకరాల భూమి, నిర్మాణం కోసం నిధులూ కేటాయించాలంటూ ప్రభుత్వానికి నివేదించింది. విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ప్రధాన కార్యాలయం, గ్రేహౌండ్స్, పోలీసు అకాడెమీ, బెటాలియన్లు, ఆక్టోపస్, సీఐడీ, ఫోరెన్సిక్ ల్యాబరేటరీలు, ఆర్మడ్ రిజర్వు, పీటీఓ ఇలా వేర్వురు కార్యాలయాల నిర్మాణం, ప్రాంగణ సముదాయాల కోసం దాదాపుగా కోటి చదరపు అడుగుల బిల్టప్ ఏరియా అవసరమని ఆ శాఖ నిర్ణయించింది. భవనాల నిర్మాణంతో పాటు చుట్టూ ప్రాంగణం, ఖాళీ స్థలాల కోసం కూడా దాదాపు ౩వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని పోలీసుశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. విజీటీఎం పరిధిలో రాజధాని నిర్మాణం చేపడతామంటూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవటంతో ఆ ఆమేరకు కొత్త రాజధానిలో డీజీపీ కార్యాలయం, పోలీసు శాఖలో ఇతర ముఖ్యమైన విభాగాల కా ర్యాలయాల నిర్మాణం కోసం దాదాపుగా ఈ కోటి చదరపు అడుగులకు పైగా బిల్టప్ ఏరియా అవసరమని ఆశాఖ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణాలోని డీజీపీ కార్యాలయం పదహారు ఎకరాల్లో దాదాపు లక్షా తొంబై వేల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో నిర్మితమైంది. అలాగే ఆక్టోపస్ 578 ఎకరాల్లో, గ్రేహౌండ్స్ 815 ఎకరాల్లో ఉంది. గ్రేహౌండ్స్ కమాండ్ కార్యాలయం బిల్టప్ ఏరియా దాదాపుగా 10 లక్షల చదరపు అడుగుల్లో ఉంది. ప్రస్తుతం కొత్త రాజధాని కేంద్రంగానే పోలీసు అకాడెమీని కూడా నిర్మించుకోవాలని ఏపీ పోలీసు విభాగం నిర్ణయించింది. ఇందుకోసం తిరుపతి, విశాఖలను కూ డా పరిశీలించిన ఉన్నతాధికారులు.. విజయవాడకు సమీపంలోనే దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. విశాఖ లో గ్రేహౌండ్స్ యూనిట్ ను ఏర్పాటు చేసుకునేందుకు కూడా కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: