ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల కవరేజికి తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సాక్షి, నమస్తే తెలంగాణ మీడియా సంస్థలు చేసిన ఫిర్యాదుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది. పార్టీ కార్యక్రమాల నుంచి తమను బహిష్కరించిన తెలుగుదేశం అధ్యక్షుడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల కవరేజీ అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని.. తమను అధికారిక కార్యక్రమాల కవరేజీకి రానీవ్వడం లేదంటూ ఈ మీడియా వర్గాలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇది వరకే ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కండేయ కట్జూ స్పందించాడు. ఈ వ్యవహారం గురించి విచారణ జరపడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాడు. వీళ్లు విచారణ జరిపి నివేదిక ఇస్తారని పీసీఐ ప్రకటించింది. మొత్తానికి ఇన్ని రోజుల నిషేధానంతరం సాక్షి , నమస్తే తెలంగాణలకు ఒక ఊరట లభించిందని చెప్పవచ్చు. మొదట తమ పార్టీ కార్యక్రమాల కవరేజీకి సాక్షి అవసరం లేదంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ని్ర్ణయం తీసుకొన్నాడు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన ఈ సంస్థ జర్నలిస్టులను తమ పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టనిచ్చేది కూడా లేదని తెలుగుదేశం వాళ్లు స్పష్టం చేశారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల విషయంలో కూడా ఈ నిసేధాన్ని వర్తింపజేశారు! ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సాక్షి, టీ మీడియాలను రానివ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ మీడియా వర్గాలు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వారి ఆందోళనల విషయంలో ఇప్పుడు పీసీఐ కూడా స్పందించింది. మరి ఈ కమిటీకి తెలుగుదేశం వాళ్లు ఏమని సమాధానం చెబుతారో!

మరింత సమాచారం తెలుసుకోండి: