ఇది సర్వేల యుగం ఎవరికి టికెట్ ఇవ్వాలి? పొత్తు పెట్టుకోవాలా, వద్దా? ఎవరితో పొత్తుపెట్టుకోవాలి. ఇలా అన్నీ సర్వేలే నిర్ణయిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేనతో దీర్ఘకాల ఎన్నికల అనుభందాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి బిజేపి రావడానికి కూడా సర్వేలే కారణం అట. వాస్తవానికి మహారాష్ట్రలో బిజేపి కొత్తగా విస్తరించింది ఏమీలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ పార్టీకి బలం తక్కువే, చక్కెర పత్తి పండే ప్రాంతాల్లో బిజేపి కొత్తగా పెరిగింది ఏమీ లేదు. రాజకీయాలను ప్రజాసమీకరణలను శాసిస్తున్న సహకార వ్యవస్థలో బిజేపి పట్టు పెరిగిందేమీ లేదు. అయినా మరి ఏం చూసుకుని బిజేపి శివసేనతో తెగదెంపులకు సిద్దం అయ్యింది. 151 సీట్లకన్నా తగ్గే ప్రసక్తే లేదని శివసేన తేల్చి చెప్పడంతో కమల నాధులు విడిగానే పోటీ చేయ్యాలని నిర్ణయించుకున్నారు. బిజేపికి 119 సీట్లను శివసేన ఆఫర్ చేసింది. కాదంటే ఇతర మిత్రులకు కోత విధించి ఆ సీట్లను బిజేపిని తీసుకోమంది. అయితే తాము జరిపించిన సర్వేలలో ఒంటరిగా పోటీచేస్తే కూడా 120 సీట్లకు తగ్గకుండా వస్తాయని తేలినట్లు బిజేపి వర్గాలు చెపుతున్నాయి. అందుకే శివసేనతో పొత్తు చర్చలు జరుపుతున్న సమయంలోనే అమిత్ షా ప్లాన్ బిని సిద్ధం చేసారు. ముందుగానే అభ్యర్ధులను అన్నిసీట్లకూ ఎంపిక చేసుకుని పెట్టుకున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే రంగంలోకి దిగాల్సిన వారికి సంకేతాలు కూడా ఇచ్చేశారు. బిజేపి మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కారీ ముందునుంచే స్వతంత్రంగా పోటీ చేసేందుకు అనుకూలంగా వున్నారు. మహారాష్ట్రా దేశంలోనే పట్టణజనాభా ఎక్కువ వున్న రాష్ట్రం. నగరాలూ పట్టణాల్లో మోడీ అనుకూల పవనాలు ఇంకా వున్నాయని బిజేపి నమ్ముతోంది. పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆ పార్టీకి శివసేనాకన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇదే ఒంటరి పోరు చేయాలన్న ధైర్యాన్ని బిజేపికి ఇచ్చింది. ప్రధాని మోడీ ప్రచారం కూడా చేస్తారు కనుక ఆ పవనాలు ఇంకా వీస్తాయని బిజేపి నమ్ముతోంది. నగర ఓటరు కులాలు ప్రాంతాలకు అతీతంగా మోడీకి స్పందిస్తారు. భవిష్యత్తుపై ఆశలు ఆకాంక్షలూ కల మధ్యతరగతిలో మోడీ మ్యాజిక్ పనిచేస్తుందని బిజేపి ఆశిస్తోంది. బిజేపి ఆశలకూ మోడీ మ్యాజిక్కు మరాఠా ఓటరు అగ్ని పరీక్ష పెట్టనున్నారు. ఇద్దరు సైద్ధాంతిక మిత్రుల మధ్య ఏర్పడిన అగాధం మహరాష్ట్ర రాజకీయాన్ని ఎటువైపు తిప్పనుందో? బిజేపికి, శరద్ పవార్ నేత్రుత్వంలోని యన్ సి పి కి మధ్య రహస్య అవగాహన కుదిరిందని శివసేన ఆరోపిస్తోంది. మెజారిటీ రావాలంటే 145 స్థానాలు రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: