కోడెల శివప్రసాదరావు (ఎపి స్పీకర్‌) మనుమడిని తల్లి వద్దకు శుక్రవారం హైదరాబాద్‌ హైకోర్టు చేర్చింది. ఈ బాబు తల్లి దండ్రులు వేర్వేరుగా ఉంటున్నందున బాలుడికి వైద్య చికిత్స సక్రమంగా అందేలా చేయడం కోసం ప్రత్యేకంగా ఓ నివాసం ఏర్పాటు చేయాలని, దీనిపై తమకు వచ్చేనెల 8లోగా తెలియచేయాలని న్యాయస్థానం ఆదేశిం చింది. కోడెల శివప్రసాద్‌ కుమారుడు కోడెల శివరామకృష్ణతో విడిపోయిన భార్య పద్మప్రియ తన కుమారుడు నాలుగేళ్ల గౌతమ్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందిం చిన ప్రధాన న్యాయమూర్తి కల్యాన్‌ జ్యోతిసేన్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందించింది. శివరామకృష్ణ ఇటీవల తన నివాసంలోకి బలవంతంగా గూండాలతో కలిసి చొరబడ్డారని, వెంట పోలీసులు కూడా ఉన్నారని తన బాబును తీసుకువెళ్లారని పిటిషనర్‌ పద్మప్రియ ఆరోపించారు. గురువారం కోర్టు ఈ బాబును తల్లికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. దీనితో ధర్మాసనం ముందుకు పోలీసులు బాబును తీసుకువచ్చారు. పోలీసుల సాయంతో తండ్రి బాబును తీసుకువెళ్లడాన్ని కోర్టు తప్పు పట్టింది. అయితే తాను పోలీసులను తీసుకువెళ్లలేదని, బాబుకు ఒబిసిటి సమస్య ఉన్నందున చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లానని తెలిపారు. ఈ కేసు విచారణను రహస్యంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ పి వేణుగోపాల్‌ కోరారు. తండ్రి వాదనను కూడా పరిశీలించిన తరువాత కోర్టు వారు ఆ బాబుకోసం తండ్రి వేరే నివాసం ఏర్పాటు చేయాలని దీని వల్ల తల్లివైపు వారు తండ్రివైపు వారు కూడా వచ్చి బాబును చూసుకు నేందుకు వీలవుతుందని ధర్మాసనం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: