‘ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రోళ్ల విగ్రహాలను ఆంధ్రోళ్లే తీసుకెళ్లాలి. అక్కరలేని, పనికిమాలిన విగ్రహాలు మాకు అవసరం లేదు. అవసరమైతే విగ్రహాలను పీకేస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌పై పెట్టిన ఆంధ్ర నాయకుల విగ్రహాలను ఆంధ్రకే తీసుకువెళ్లాలని స్పష్టంగా చెప్పారు. పద్మశాలి భవన్‌లో కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి, బాపూజీ శతజయంతి వేడుకలను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌పై కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దానికి ఇబ్బందేమీ లేదు. ముందు మనవికాని విగ్రహాలను తొలగించాలని అన్నారు. ‘ఖర్చులు కూడా మేమే భరిస్తాం. మీ విగ్రహాలు మీరు తీసుకెళ్లండి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మనకు సంబంధం లేని విగ్రహాలను తొలగించి కొండా లక్ష్మణ్ బాఫూజీ, ప్రోఫెసర్ జయశంకర్ లాంటి వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుందామని అన్నారు. దీనికి చంద్రబాబు లాంటి వారినుంచి అడ్డంకులు వస్తాయని, అయితే తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న బిజెపి తమకు మద్దతుగా నిలవాలని వేదికపై ఉన్న బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు.  ఏడాదిపాటు బాపూజీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుందామని పేర్కొన్నారు. నిజాం కాలంనుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ పోరుబాట పట్టారని, 69నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రిపదవికి రాజీనామా చేసి, మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్నారని అన్నారు. సుదీర్ఘ పోరాట చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీదని, జలదృశ్యంలో తెరాస పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అనుమతించారని ఆనాటి విషయాలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీర్తి శాశ్వతంగా నిలిచేలా చేస్తామని అన్నారు. తాను ముఖ్యమంత్రిని అయినా తనలో ఉద్యమసోయి పోలేదన్నారు. బాపూజీ పేరుతో చేనేత మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. చేనేత సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఇద్దరు గొప్ప నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటివారు కాగా, ప్రొఫెసర్ జయశంకర్ రెండోవారని ముఖ్యమంత్రి అన్నారు. సమావేశంలో బండారు దత్తాత్రేయ, కె కేశవరావు తదితరులు కొండా లక్ష్మణ్ బాపూజీతో తమ అనుబంధాన్ని గుర్తు చేశారు. బాపూజీ తెలంగాణకు అందించిన సేవలను కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: