తల్లిదండ్రులకు ప్రభుత్వం పింఛను ఆపేసిందని మనస్తాపానికి గురైన ఓ గిరిజన వికలాంగుడు గుండె పోటుతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా రామచంద్రా పురం మండలంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు...కొత్తవేపకుప్పం గిరిజన కాలనీకి చెందిన నిరుపేదలైన కొటారి బోడయ్య (75), కొటారి రమణమ్మ (65)ల ఒక్కగానొక్క కొడుకు కొటారి దేశయ్య పుట్టుకతోనే వికలాంగుడు. తల్లి కుష్టువ్యాధితో బాధపడుతోంది. ఇప్పటి వరకూ వికలాంగుల కోటాలో తల్లికి, కుమారునికి, వృద్ధాప్య కోటాలో తండ్రికి ముగ్గురికీ పింఛను వస్తుండేది. ఈ పింఛనే వారికి ఆధారం. ప్రస్తుతం ఇంటికొక్క పింఛను మాత్రమే ఇవ్వాలనే ఆదేశాలు ప్రభుత్వం నుండి రావడంతో అధికారులు జాబితా నుండి దేశయ్య తల్లిదండ్రుల పేర్లను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న దేశయ్య ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. గ్రామస్తులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్ని స్తుండగానే ప్రాణాలు విడిచాడు. వృద్ధులైన తల్లిదండ్రులు లబోదిబోమంటూ గుండెలు బాదుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కొడుకును కోల్పోయిన ఆ వృద్ధులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కమిటీ నిర్ణయం మేరకే : గంగాభవానీ, ఎంపిడిఓ కొత్తవేపకుప్పం పంచాయతీలో పింఛన్ల కోసం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకే కొటారి బోడయ్య, కొటారి రమణమ్మలను అనర్హులుగా గుర్తించాం. పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డిని విచారించి తక్షణమే చర్యలు తీసుకుంటాం.

మరింత సమాచారం తెలుసుకోండి: