వచ్చే నెలలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో తాజా రాజకీయపరిణామాలు ఒకవిధంగా ఊహించనివే. పాతికేళ్ల మిత్రత్వాన్ని బిజెపి, శివసేనలు, పదిహేనేళ్ల స్నేహబంధాన్ని కాంగ్రెస్‌, ఎన్‌సిపిలు ఏకకాలంలో తెంచుకున్నాయి. దాంతో అసెంబ్లీ ఎన్నికలలో చతుష్కోణపు పోటీ అనివార్యమయ్యేటట్టే కనిపిస్తోంది. రెండు కూటములూ ఇలా విచ్ఛిన్నం కావడానికి అయిదో, పదో సీట్ల దగ్గర వచ్చిన మడతపేచీయే కారణమైనట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉంటుందన్న వ్యాఖ్యలూ పరిశీలకులనుంచి వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటి మాత్రమే కాక, జాతీయ రాజకీయాలను కూడా గణనీయంగా ప్రభావితం చేయగల రాష్ట్రాలలో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. వామపక్షాలూ ఈ రాష్ట్రంలో కొంత ఉనికి ఉన్నవే. ప్రాంతీయతా, భాషాభిమానాలను ఇతరుల పట్ల తీవ్ర అసహనం రూపంలోనూ, విధ్వంసాత్మకంగానూ ప్రదర్శించడానికి అలవాటుపడిన శివసేననూ, బిజెపినీ ముడిపెట్టినది హిందుత్వభావజాలమే. ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో ఈ రెండు పార్టీలూ కలసి హెచ్చుస్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ కూటమికి నల్లేరుపై నడకగా మారి అధికారాన్ని అందిస్తాయన్నదే ఎక్కువమంది అంచనా. ఈ పరిస్థితిలో ఇవి తెగతెంపులు చేసుకొవడం ఊహించనిదే. దీనికి కారణం ఏమైనప్పటికీ, ఈ మతతత్వపార్టీల మైత్రి ఇలా ముక్కలవడం లౌకికవాదశక్తులకు సంతోషం కలిగించే పరిణామం. మోడీ కేంద్రంలో అధికారం చేపట్టిన ఒకటి రెండు రోజులకే ఈ రాష్ట్రంలో ఒక ముస్లిం ఐటి ఉద్యోగిని హతమార్చడం తదితర ఘటనలు ఎన్నికలముందు మతప్రాతిపదికపై ప్రజలను చీల్చే కుత్సితత్వానికి అద్దంపట్టాయి. తొంభై దశకంలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముంబరులో జరిగిన అల్లర్లలో శివసేన, బిజెపిల పాత్ర గురించి వచ్చిన ఆరోపణలు తెలిసినవే. ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన శివసేన, బిజెపి ప్రభుత్వం జనంలో భయభ్రాంతులను పెంచింది తప్ప అభిమానాన్ని పొందలేకపోయింది. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి అందలం ఎక్కించినది ఆ కారణంతోనే. ఈ దృష్ట్యా చూసినప్పుడు కాంగ్రెస్‌, ఎన్‌సిపిలు బంధాన్ని తెంచుకోవడమూ అంతే అనూహ్యమూ, ఆశ్చర్యకరమూ కూడా. కేంద్రరాష్ట్రస్థాయిలలో అవినీతి కుంభకోణాలకు ప్రతీకలుగా పేరుతెచ్చుకుని జనంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఈ పార్టీలు ఇప్పుడు అనైక్యంగా పోటీచేసి ఏం సాధించదలచుకున్నాయో చూడవలసి ఉంది. మతతత్వ పార్టీల మధ్య ముసలం పుట్టిన ప్రస్తుత సందర్భంలో లౌకికవిలువల పరిరక్షణకోసమైనా కలసి ఉండాలన్న సద్భావన కాంగ్రెస్‌, ఎన్‌సిపిలలో పుట్టకపోవడం వాటి దిశారాహిత్యానికి కొండగుర్తు. ఇప్పుడు ఎటువంటి రాజకీయపునస్సమీకరణలు, అవకాశవాద పొత్తులు ఏర్పడతాయో వేచి చూడాలి. ఏది జరిగినా ఆశ్చర్యపోనవసరంలేదు. అయిదో పక్షంగా చెప్పదగిన మహారాష్ట్ర నవనిర్మాణ సమితి ఎత్తుగడలు ఎలా ఉంటాయన్నదీ చూడవలసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: