మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రేపు హైదరాబాద్ రానున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న ఆయన,ఈ నెల 30న ఢిల్లీలో జరిగే నాస్కామ్ సదస్సులో పాల్గొననున్నారు. అయితే, ఢిల్లీ వెళ్లేముందు హైదరాబాద్ వస్తున్న సత్య నాదెళ్ల, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తారా? లేదా? అన్న అంశంపై సర్వత్ర చర్చ నడుస్తోంది. భారత్ తో కలిసి పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని ఇటీవలే ప్రకటించిన సత్య నాదెళ్ల, ఎలాంటి ప్రతిపాదనలతో భారత్ కు వస్తున్నారోనన్న అంశంపైనా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కేంద్రం హైదరాబాద్ లో పనిచేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఐటీ దిగ్గజాలను సీమాంధ్రకు ఆహ్వానిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇక, మరిన్ని సంస్థలు హైదరాబాద్ లో కాలుమోపేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ వస్తున్న సత్య నాదెళ్లను ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా కలిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనేనన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: