చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పాతరవేసి ప్రజాధనాన్ని దుబారాగా ఖర్చుపెడుతోందని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సచివాలయంలో సిఎంఒ పేషీ మరమ్మత్తుకు పది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారన్నారు. అదే సొమ్ముతో విజయవాడలో అన్ని హంగులతో ఒక సిఎంఒ కార్యాలయాన్ని నిర్మించవచ్చన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చాంబర్ కోసం 80 లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారన్నారు. అలాగే చాంబర్‌లో ఒక టీవీ కోసం నాలుగు లక్షల రూపాయలు వెచ్చించారన్నారు. ఇటీవల మంత్రులు, సమాన హోదా ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తుల నెలసరి అద్దె ఒక లక్ష రూపాయలకు పెంచారన్నారు. రాష్ట్రప్రభుత్వం పొదుపు గురించి శ్రీరంగ నీతులు చెబుతూ, ఆచరణలో ఇష్టం వచ్చినట్లు ఖజానాకు చిల్లు పెట్టే విధంగా నిధులను ఖర్చుపెడుతున్నారన్నారు. సంక్షేమ పథకాల్లో సామాజిక పింఛన్లకు నిధుల్లో కోత విధిస్తున్నారన్నారు. అలాగే సంక్షేమ శాఖ హాస్టళ్లను కూడా తగ్గించేందుకు పన్నాగం పన్నుతోందని ఆయన తెదేపా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర శాసనసభ సభాపతి కూడా విదేశీ పర్యటనలు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు లేవంటూ ఒక వైపు నిధులను వసూలు చేస్తున్నారన్నారు. దీనికి జీవో కూడా జారీ చేశారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి గడ్డుగా ఉందని చెబుతూ, ఇష్టం వచ్చినట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: