నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నికలో పార్టీ విప్ ధిక్కరించిన 8 మంది వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ సీపీ తరపున గెలుపొందిన ఈ జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ చైర్మన్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. విప్ ధిక్కరణపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఈ చర్య తీసుకున్నారు. కలివెల జ్యోతి (ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం జెడ్పీటీసీ), పులిచర్ల వెంకటనారాయణరెడ్డి (వింజమూరు), సోమయ్యగారి పెంచలమ్మ (కావలి), షేక్ షల్మాషరీమ్ (ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల), ఉప్పల ప్రసాద్‌గౌడ్ (గూడూరు నియోజకవర్గం కోట), దువ్వూరు భారతి (చిట్టమూరు), తిరువీధి రమేష్ (సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు), ముప్పల విజేత (సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం జెడ్పీటీసీ)లపై కలెక్టర్ అనర్హత వేటు వేశారు. అధికార పార్టీ ఆగడాలతో.. నెల్లూరు జిల్లా పరిషత్‌లో వైఎస్సార్ సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీ ఆగడాలకు దిగింది. దీంతో ఆది నుంచి జిల్లా పరిషత్ ఎన్నిక గందరగోళంగా మారింది. జిల్లాలో మొత్తం 46 జెడ్పీటీసీ స్థానాలుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 31 మంది, టీడీపీ నుంచి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో నెల్లూరు జిల్లా పరిషత్‌ను దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని పలు రకాలుగా జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారు. జూలై 5న జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, తగిన మెజార్టీ సమకూరకపోవడంతో టీడీపీ నేతలు ఎన్నికను జూలై 13కి వాయిదా వేయించారు. ఆరోజుకు అధికార పార్టీ నేతలు ఏడుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులను టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఇద్దరు సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ, వైఎస్సార్ సీపీలకు 22 మంది సభ్యుల వంతున సమాన బలం చేకూరింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ సీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. జూలై 20న ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆరోజుకు 8 మంది వైఎస్సార్ సీపీ సభ్యులు టీడీపీ వైపు వెళ్లారు. రెండు పార్టీలకు చెరో 23 మంది సభ్యుల సమాన బలం ఉండటంతో లాటరీ నిర్వహించారు. డిప్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గెలుపొందారు. పార్టీ విప్‌ను ధిక్కరించి టీడీపీకి మద్దతు పలికిన 8 మంది జెడ్పీటీసీ సభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ జూలై 22న వైఎస్సార్ సీపీ కలెక్టర్ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన కలెక్టర్ శ్రీకాంత్ 8 మంది సభ్యులపై అనర్హత వేటు వేశారు. టాగ్లు: నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక, వైఎస్సార్ సీపీ, జెడ్పీటీసీ సభ్యులు, కలివెల జ్యోతి, Nellore zp chairman election, YSRCP, zptc members, kalivela jyothy

మరింత సమాచారం తెలుసుకోండి: