నల్లధనం ‘పిల్లి’ మెడలో గంట కట్టే కార్యక్రమం ఇప్పుడు మొదలైందట. ఆస్ట్రేలియాలోని కెయిర్నెస్ నగరంలో జరిగిన ప్రముఖ దేశాల-జి20- కూటమి ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈ సంగతి వెల్లడైంది. నల్లడబ్బు నిల్వలకు సంబంధించిన సమాచార వినియమంపై ‘అంతర్జాతీయ శుల్కాల వ్యవస్థ’ అధ్వర్యంలో కుదిరిన అంగీకారం ప్రకారం వివిధ దేశాలలోని బ్యాంకుల లోని దొంగ ఖాతాల వివరాలు అన్ని దేశాలకు తెలిసిపోనున్నాయట. అందువల్ల మన దేశానికి చెందిన నల్లడబ్బు కామందుల విదేశీయ బ్యాంకు ఖాతాల గుట్టురట్టయిపోతుందన్నది జరుగుతున్న ప్రచారం. 22వ తేదీన జరిగిన సమావేశంలో మన దేశానికి చెందిన వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. జి-20 ప్రధానంగా పెద్ద దేశాల ఆర్థిక మంత్రుల, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ల సమాఖ్య! 19 పెద్ద దేశాల, ఐరోపా ఆర్థిక సమాఖ్య కలసి ఈ సమాఖ్య ఏర్పడి ఉంది. ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో 80శాతానికి పైగా ఈ దేశాలలోనే జరుగుతోందట. అందువల్ల విదేశీయ బ్యాంకులలోని నల్లడబ్బు దాచినవారి గుట్టురట్టు కావడం వల్ల అంతర్జాతీయ సమాజానికి గొప్ప మేలు జరుగుతుంది. ఈ నల్లడబ్బునకు సంబంధించిన సమాచార వినిమయ అంగీకారాన్ని అమలు జరపడానికి ఇదివరకే 46 దేశాలు ముందుకొచ్చాయన్నది జి-20 కూటమి సమావేశంలో వెల్లడైన సంగతి. మన దేశానికి చెందిన వారు విదేశాలలో దాచిన నల్లడబ్బు గురించి ఆరా తీయడానికై ప్రత్యేక పరిశోధక బృందం -సిట్- ఏర్పడి ఉంది. వివిధ దేశాలతో మనకు ద్వైపాక్షిక అంగీకారాలు కూడ కుదిరి ఉన్నాయి. అయినప్పటికీ దేశం నుండి తరలి పోయిన నల్లడబ్బు జాడ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక బ్యాంకు మాజీ ఉన్నతోద్యోగి ఒకరు రహస్యంగా సేకరించిన సమాచార సంపుటిలో భారత దేశానికి చెందిన 700 మంది నల్ల ఖాతాల వివరాలు ఉన్నాయట. ఈ వివరాలను తెలియజేయవలసిందిగా మన ప్రభుత్వం స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ సమాచారం బహిరంగ పరచడం సాధ్యం కాదని స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసిందట. ఉభయ దేశాల మధ్య కుదిరిన పన్నుల ఒప్పందం ప్రకారం నల్ల ఖాతాలను వెల్లడించడానికి వీలు కాదని స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసిందట. అలాంటప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నందువల్ల ప్రయోజన మేమిటో అర్థం కావడం లేదు. నల్ల ఖాతాల గుట్టు రట్టు కాకుండా నిరోధించడానికి వీలైన నిబంధనలను మనం కుదుర్చుకున్న ఒప్పందాలలో ఎందుకు చేర్చారు? అన్న ప్రశ్న ఐదారేళ్లుగా వినబడుతూనే ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. విదేశీయ బ్యాంకులలో నిక్షిప్తమైన అక్రమధనాన్ని వెలికి తీయడానికి ఒప్పందం అవసరం..వెలికి తీయడాన్ని నిరోధించేందుకు వీలైన ఒప్పందాలు ఎందుకని కుదిరిపోయాయి? ఈ నేపథ్యంలో జి-20 సమావేశంలో వెల్లయిన సమాచార వినిమయ అంగీకారం హర్షణీయం. ఈ సమాచారం లభించినట్లయితదే నల్లడబ్బును విదేశాలలో నిక్షిప్తం చేసినవారి బండారం బద్దలైపోతుంది. కానీ ఈ ఒప్పందం 2017 నుండి మాత్రమే అమలులోకి వస్తుందట...! మరో మూడేళ్లపాటు విదేశాలలోని నల్లడబ్బు వివరాలు మన ప్రభుత్వానికి అందుబాటులోకి రావు. మన ప్రభుత్వం ఇతరేతర మార్గాల ద్వారా స్విట్జర్లాండ్‌లోను ఇతర దేశాలలోను జమ అయి ఉన్న మనవారి నల్లడబ్బును వెలికి తీయడానికి ఈ మూడేళ్ల పాటు ప్రయత్నించలేదు. అలా ప్రయత్నించకుండా ఈ సహజ సమాచార వినియోగంపై కుదిరిన ఒప్పందం అడ్డుతగలవచ్చు. 2017 నుంచి సమాచారం సహజంగానే నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి ప్రభుత్వానికి తెలిసిపోతుంది. అందువల్ల దొంగలు సహజంగానే పట్టుబడిపోవడం ఖాయం. కానీ ఈ మూడేళ్లపాటు మాత్రం దొంగలు దొరకరు. అందువల్ల ఈ మూడేళ్ల కాల వ్యవధిలో మన దేశం ఘరానా రాజకీయ వాణిజ్యవేత్తలు, అధికారులు తదితరులు స్విట్జర్లాండ్ మొదలైన చోట్ల జమ చేసిన నల్లడబ్బు వివరాలు రహస్యంగానే ఉంటాయి. అక్రమధన యజమానులు ఆయా దేశీయ బ్యాంకుల నుంచి తమ ఖాతాలలోని డబ్బును ఉపసంహరించేసి ఖాతాలను రద్దు చేసుకోవచ్చు. లేదా ఇతరుల పేర్లతోను బినామీ పేర్లతోను ఖాతాలు తెరచి వాటిలో తమ డబ్బు జమ చేయవచ్చు. ‘‘్ఫలానా వారి పేరుతో మన దేశంలోని ఫలానా బ్యాంకులో ఖాతా ఉంది. అందులో ఇంత మొత్తంలో డబ్బు జమ అయి ఉంది..’’ అని విదేశీయ ప్రభుత్వాలు మన ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఆ ఫలానా వ్యక్తి మనదేశంలో దొరకడు. అలాంటి ఖాతాలను మన ప్రభుత్వం జప్తు చేయగలగాలి. అలాంటి అవకాశాం ఈ కొత్త ఒప్పందం వల్ల లభిస్తోందా? అన్నది స్పష్టం కాలేదు. ఏమయినప్పటికీ 2017లోగా నల్లడబ్బులో అధికభాగం ఆయా విదేశీయ బ్యాంకుల నుండి ఉపసంహరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది నుంచే అమలు జరపాలని మన ప్రభుత్వం ఎందుకని కోరడం లేదు? విదేశాలలోని నల్ల డబ్బు ఖాతాల వివరాలు మూడేళ్ల తరువాత సహజంగానే వెల్లడైపోతాయన్నది జరుగుతున్న ప్రచా రం. కానీ ఈ ఒప్పందం వల్ల పన్నులకు సంబంధించిన సమాచారాన్ని వివిధ దేశాలు పరస్పరం వెల్లడించుకొనడానికి వీలైన వ్యవస్థమాత్రమే 2017 తరువాత ఏర్పడనుంది. అధికారికంగా ఇది అంతర్జాతీయ శుల్క సమాచార వినిమయ వ్యవస్థ. దీని వల్ల వివిధ దేశాలలో వివిధ వ్యక్తులు చెల్లించ వలసిన పన్నుల వివరాలు వెల్లడించవచ్చు. నల్లడబ్బు ఖాతాలను వెలికి తీయడానికి ఇలాంటి ఒప్పందం ఎలా దోహదం చేస్తుంది? దోహదం చేస్తుందన్న భ్రమలో 13 ఏళ్లపాటు ప్రభుత్వాలు మిన్నకుండి పోవడానికి మాత్రమే ఈ ఒప్పందం ప్రాతిపదిక కానుందా? అనేక అంతర్జాతీయ అంగీకారాలలోని నియమాల వలెనే ఈ ‘వినిమయ’ ఒప్పందంలోని నిబంధనలు కూడ అంతుపట్టడం లేదు! జర్మనీలోని లీచ్‌స్టెన్ బ్యాంకులో నల్లధనం దాచిన వారి పేర్లు ప్రభుత్వానికి 2011 జనవరిలో తెలిసిపోయాయి. కానీ ఈ పేర్లను బయట పెట్టడానికి ఇతర దేశాలతో కుదుర్చుకున్న రెండు ఒప్పందాలు అడ్డంగా ఉన్నాయన్నది సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసిన వాదం. ఈ ఒప్పందంలోని నిబంధనలను మార్చేవరకు, విదేశీయ నల్ల ఖాతాల వివరాలు బహిరంగ పరచడానికి వీలు లేదట. ఇలా అవరోధకరమైన ఒప్పందాలలో మొదటిది ..రెండుసార్లు పన్ను విధించకుండా నిరోధించే ఒప్పందం, రెండవది ఆదాయంపన్ను సమాచార వినిమయ ఒప్పందం. జర్మనీ బ్యాంకులో డబ్బు దాచిన వారి పేర్లను వెల్లడించకుండా ఈ రెండు ఒప్పందాలు నిరోధించాయట. ఇది 2011 జనవరి నాటి మాట. మూడేళ్లు గడచిపోయినప్పటికీ అవరోధాలను తొలగించడంలో మన ప్రభుత్వాలు కృతకృత్యం కాలేదు. అందువల్లనే లీచ్‌స్టెన్ బ్యాంకులో దాచిన ఘరానాల పేర్లు ఇప్పటికీ వెల్లడి కాలేదు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ అంగీకారం నల్లడబ్బును వెల్లడి చేయగలుగుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: