తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య మరోసారి వివాదం మొదలైంది. అధికార బలంతో రాజ్యాంగాన్ని, చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లఘింస్తోందని ఎపి సర్కార్‌ ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనల వల్ల తమ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారిందని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు సోమవారం సుదీర్ఘ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన నిరసించారు. కార్పొరేషన్లను, అకాడమీలను విభజించడానికి నిర్ధిష్టమైన పద్ధతులు పాటించకుండా కేవలం పేరు మార్చివేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించినట్లు సమాచారం. ఇది రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ఆయా సంస్థల్లో పరిపాలన స్తంభించటంతో పాటు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ఈ విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కృష్ణారావు కోరారు. ఉదాహరణగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఏ షెడ్యూల్‌లో చేర్చని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ లాంటి పలు సంస్థల విషయంలో ఏదో ఒకటి తేల్చాలని కోరారు. ఆయా విభాగాలకు సంబంధించిన ఉభయ రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని గరవ్నర్‌ నరసింహన్‌ను కృష్ణారావు కోరినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: