టిఆర్‌ఎస్‌లో పదవుల పంచాయితీ మొదలైంది. దసరా తరువాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన నామినేటెడ్‌ పదవుల భర్తీ జరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలోని ముఖ్య నేతలు, కేడర్‌ అప్రమత్తమైంది. అయితే, ఇటీవలి కాలంలో టిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కెసిఆర్‌  ఆపరేషన్‌ ఆకర్శ్‌ తో ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో వారికి ఎక్కడ పదవులు వస్తాయోననే అందోళనను ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న నేతలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పన్నేండేళ్లుగా టిఆర్‌ఎస్‌లో ఉండి తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా అధినేత కెసిఆర్‌ ఏ పిలుపు ఇచ్చినా విజయవంతం చేసిన గులాబీ కేడర్‌ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి రావడంతో పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ముందుకు ప్రభుత్వం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దే పనిపై సీఎం కెసిఆర్‌ దృష్టి పెట్టడంతో నామినేటెడ్‌ పదవులకు నేతల ఎంపిక ప్రక్రియను దసరా అనంతరమే చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసే ఉద్దేశ్యంతో  ఆపరేషన్‌ ఆకర్శ్‌  పేరుతో ఇతర పార్టీల నుంచి భారీగా వలసనలు ప్రోత్సహించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన టిడిపి సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జెడ్పీ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ వంటి నేతలంతా టిఆర్‌ఎస్‌లో చేరారు.  అలాగే పలువురు ఎమ్మెల్సీలు కూడా పార్టీలో చేరారు. మరోవైపు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం పలువురు టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటే వారి అనుచరులు, పార్టీ కేడర్‌ కూడా పార్టీలో చేరారు. ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లోకి నేతల వలసల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్‌ నేతలు, వారి అనుచరులకు పార్టీలో అధిక ప్రాధాన్యం లభిస్తుందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న కేడర్‌లో ఆందోళన మొదలైంది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి భవిష్యత్తులో నామినేటెడ్‌ పదవులలో ప్రాధాన్యం ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పార్టీ అధినేత కెసిఆర్‌కు అన్ని విషయాలూ తెలుసుననీ, అధినేత తమకేమాత్రం అన్యాయం చేయడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాత కేడర్‌ సైతం తమ నేతలకు నామినేటెడ్‌ పదవులలో న్యాయం జరిగేలా చూడాలనీ, ఆ తరువాతనే కొత్తగా పార్టీలో చేరిన వారి గురించి ఆలోచన చేయాలని పార్టీ అధినేతను కోరుతున్నారు. కాగా, టిఆర్‌ఎస్‌లో కొత్తగా ఇతర పార్టీల నుంచి చేరిన వారికి నామినేటెడ్‌ పదవులలో అధిక ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారాన్ని పార్టీ వర్గాలు కొట్టిపడేస్తున్నాయి. అలాంటిది ఏమీ జరగదని భరోసా ఇస్తున్నాయి. కెసిఆర్‌ వెంట ఉద్యమంలో ఉండి పని చేసింది ఎవరో ఆయనకు బాగా తెలుసనీ, అలాగే వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై కూడా ఆయనకు స్పష్టత ఉందని పేర్కొంటున్నాయి. కెసిఆర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మంత్రివర్గ కూర్పుతో పాటు ఆయన పనితీరుకు అనుగుణంగా పనిచేసే అధికారులను ఆయన చుట్టూ నియమించుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. కెసిఆర్‌కు ఎవరు ఉద్యమంలో చిత్తశుద్ధితో పని చేశారో ఎవరు అధికారం కోసం చూస్తున్నారో అనే విషయాలు తెలుసని పేర్కొంటున్నారు. దీనిపై పార్టీవర్గాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నాయి. భవిష్యత్తులోనూ నామినేటెడ్‌ పోస్టుల విషయంలోనైనా లేదా పార్టీ పదవుల విషయంలోనైనా పార్టీని ముందు నుంచి నమ్ముకుని ఉన్న వారికే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: