అధికారంపై ఆశలు వదలుకున్న వారిలో కూడా మళ్లీ చిగురిస్తున్నాయి. అనూహ్యంగా మారిన సమీకరణాల్లో అవకాశాలు తమవేనన్న అంచనాల్లో ఎవరికి వారున్నారు. మహారాష్ట్రలో బహుహుఖ పోటీతో అసెంబ్లీ ఎన్నికలు లాటరీని తలపిస్తున్నాయి. కింగ్ తామేనని కొందరు.. ఈ కింగ్‌లను తయారు చేసేది మేమేనని మరికొందరు ఊహాల్లో తేలియాడుతున్నారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంపై వ్యతిరేకతతో బీజేపీ-సేనల నేతృత్వంలోని కాషాయ కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని అంతా భావించారు. విజయం నల్లేరు మీద నడకేననుకున్నారు. కానీ అదే అత్యుత్సాహం వారిని ఆవహించి.. అధికారంపై వ్యామోహంగా మారి పాతికేళ్ల బంధాన్ని కాదునుకునేలా చేసింది. చివరకు ఎవరికి వారు పోటీ చేయాలని భావించారు. అటు ఎన్సీపీ - కాంగ్రెస్‌లు కూడా కలహాల కాపురం వద్దనుకున్నాయి. అంతే చతుర్ముఖ పోటీ ఖాయమైంది. రాజకీయ సమీకరణలు మారడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పక్కదారి పట్టింది. బీజేపీ -సేనల మధ్య మాటల యుద్ధంతో చాలా కాలంగా ఆశలు పెట్టుకున్న వ్యతిరేకత గాలికి కొట్టుకుపోయింది. కాంగ్రెస్‌ సొంతబలాన్ని.. నాయకులను నమ్ముకుంది. సొంతంగా కాకపోయినా.. భవిష్యత్తు పొత్తులపై ఎన్సీపీ ఆశావాదంతో ఉంది. మోడీ హవాపై ఆశలుపెట్టుకున్న కమలనాధులు.. గుజరాత్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌ను ప్రచారం చేసుకుంటోంది. అటు శివసేనులు కూడా బీజేపీ మోసాన్ని ఎండగడుతూ మరోసారి మరాఠా మంత్రాన్ని అందుకున్నారు. తమ్మడిని కూడా దారిలోకి తెచ్చుకుంది. అంతే కాదు, మరాఠా వర్సెస్‌ గుజరాత్‌ మధ్య పోటీ అంటూ సామ్నాలో సెంటిమెంట్‌ సంకేతాలు జనాలకు పంపుతోంది. ఇక చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ధేశించగల చిన్న పార్టీలు కూడా బహుముఖ పోటీలో లబ్ధి పొందడానికి అభ్యర్ధులను పెట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వీరికి తోడు.. స్వతంత్ర్య అభ్యర్ధులు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా మరాఠా గడ్డలో ఇప్పుడు ఎన్నికలు లాటరీని తలపిస్తున్నాయి.. నియోజకవర్గాల్లో జరుగుతున్న బహుముఖ పోరులో ఎవరికి విజయం తగులుతుందో తెలియదు. నాలుగు పార్టీలు బరిలో ఉండడంతో యువ నాయకులకు డిమాండ్‌ పెరిగింది. నాయకులు కూడా ఎవరికి వారు జంప్‌ జిలానీ అవతారాలు ఎత్తుతున్నారు. పార్టీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ అందరూ టికెట్ల వేటలో ఉన్నారు. ఏ పార్టీ ఆదరిస్తే అదే తమ గుర్తు అంటున్నారు. డబ్బు ప్రభావం భారీగానే ఉండబోతుంది. ఈ ఎన్నికల్లో నిన్నటి దాకా ఉన్న అంచనాలు తారుమారయ్యాయి.. మరి కింగ్‌ ఎవరు... కింగ్‌ మేకర్‌ ఎవరు అన్నదే తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: