చాయ్ వాలాలకు రాజకీయాలు కలిసొస్తున్నాయి కాబోలు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి పదవి వరకు ఎదిగిన నరేంద్రమోడీ కూడా చాయ్ వాలా కాగా... ఇపుడు తమిళనాడు రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పన్నీర్ సెల్వం కూడా చాయ్ వాలానే కావడం గమనార్హం. ప్రమాణస్వీకారం సందర్భంగా సెల్వం భావోద్వేగానికి గురై బొట బొట కన్నీరు కార్చారు. జయలలితకు జైలు శిక్ష పడడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో మంత్రులంతా భావోద్వేగంతో నే ప్రమాణం చేశారు. జయలలిత క్యాబినెట్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. యథావిధిగా జయ మంత్రులంతా సెల్వం కేబినెట్ లో కొనసాగుతున్నారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని అధిష్టించటం ఇది రెండోసారి. పన్నీరు సెల్వం జయలలితకు నమ్మినబంటు. 2000 లో భూకుంభకోణానికి సంబంధించిన కేసులో జయ జైలుకు వెళ్లిన పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కావడంతో జయలలిత పన్నీర్ సెల్వంకే మరోసారి పట్టం కట్టారు. మదురైకి చెందిన పన్నీర్ సెల్వం ఒక టీస్టాల్ యజమాని. ఆయన కుటుంబానికి చెందినవాళ్లు ఇప్పటికీ ఆ టీ దుకాణాన్ని నడుపుతుండడం గమనార్హం. మధురైలో అత్యంత ప్రభావంతమైన దేవర్ వర్గానికి చెందిన పన్నీర్ సెల్వం1996లో పెరియంకుళం మునిసిపాలిటీకి ఛైర్మన్ గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. జయలలితకు అత్యంత ఆప్తమిత్రురాలైన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం పన్నీర్ సెల్వంకు బాగా కలిసొచ్చింది. 2001లో పెరియంకుళం నుంచి తొలిసారి ఎమ్మెల్యే గా ఎంపికైన సెల్వంకు కీలక రెవెన్యూ మంత్రి పదవి కూడా దక్కింది. అదే సంవత్సరంలో జయలలిత రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి అధికారంలోకి వచ్చిన జయలలిత కాబినెట్ లో సెల్వం నెంబర్ 2 హోదాను అనుభవించారు.  1991- 96 మధ్య తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత ఆదాయానికి మించి 66 కోట్ల ఆస్తులు అక్రమంగా సమకూర్చుకున్నారంటూ డిఎంకె తో పాటు సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి 18 ఏళ్ల తర్వాత బెంగుళూరు ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించింది. కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష , వంద కోట్లు జరిమానా విధించడంతో.. అమ్మ ఎమ్మెల్యే సభ్యత్వంతో పాటు సీఎం పదవిని కోల్పోయారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యమైంది. జయలలిత జైలు నుంచి సీల్డ్ కవర్ లో సిఎంగా పన్నీర్ సెల్వం పేరు ప్రకటించగా...అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై ఆయనను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్ణాటక హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు విధించిన శిక్ష సస్పెండ్ చేయాలని ఆమె పిటిషన్ లో కోరారు. 2016లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: