తెలంగాణ ప్రజలు నిన్న మొన్నటి వరకు బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రజలే కాక ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి గల్లీ లీడర్ల వరకు బోనం ఎత్తుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయంలో బోనాలు, బతుకమ్మ భాగమని ముఖ్యంగా 2009 ఉద్యమం తర్వాత టీఆర్‌ఎస్‌ తన రాజకీయ ప్రయోజనం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. నేడు అధికారంలోకి వచ్చాక వాటిని రాష్ట్ర పండుగలుగా అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈసారి సద్దుల బతుకమ్మను (దసరా రోజు) హైదరాబాద్‌ ట్యాంక్‌బండపైన 25 వేల మంది మహిళలతో ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కూతురు ఎంపీ కవిత ప్రకటించారు. ఈ వేడుకకు దేశంలోని మహిళా ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఆయా రాజకీయ పార్టీల ప్రముఖరాళ్ళు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారిణులను ఆహ్వానిస్తామంటున్నారు. ఇందుకు రూ. 10 కోట్లు కేటాయిస్తూ జిల్లాకు రూ. 10 లక్షల చొప్పున పంపిణీ చేసి గ్రామాలస్థాయి వరకు అంగరంగ వైభవంగా బతుకమ్మ జరపాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. చేలు, చెలకలు చీడపీడలు సోకకుండా మైసమ్మ పోచమ్మలు రక్షిస్తారని రైతుల విశ్వాసం. అందుకోసం పంట చేతికి రాగానే బోనం (భోజనం) వండి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. చదువు, శాస్త్రం తెలియని రోజుల్లో ప్రజలు, ఎండ, వాన, ఉరుము మొదలగు వాటిని అతీతశక్తులుగా భావించేవారు. నేడు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, మనిషి గ్రహాంతరాలకు వెళ్తున్న రోజుల్లో, పాలకవర్గాలు మరో పక్క కొత్త కొత్త రూపాలలో మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నాయి. వెనకబాటుకు, హింస, అణచివేతలకు గురైన స్ర్తీలకు దేవుళ్ళ పేరుమీద మోసపూరితమైన సంకేతాలు పంపుతున్నారు. ఆయా కాలాల్లో ఈ దోపిడీ, అణచివేత వ్యవస్థపై తిరుగుబాటు చేసిన వారిని దేవతలను, దేవుళ్ళను (ఏసుక్రీస్తు) చేశాయీ పాలకవర్గాలు. ఈ నేపథ్యం గలవారే మైసమ్మ, పోచమ్మ. ఆ తర్వాతి కాలంలో ఈ కోవకు చెందినవారే సమ్మక్క, సారక్క. ఆధునిక కాలంలో చాకలి ఐలమ్మ కొమరం భీంలను సైతం దేవతలను చేసినా ఆశ్చర్య పడాల్సింది లేదు. బతుకమ్మ కూడా ఉత్పత్తి కులాల స్ర్తీల పండుగే. మాతృస్వామిక వ్యవస్థకు ప్రతీకనే. వర్షాకాల అనంతరం (సెప్టెంబర్‌-అక్టోబర్‌) చెట్లు విపరీతంగా పూలు పూస్తాయి. చేను, చెలకల్లో పనిచేసే ఉత్పత్తి కులాల సీ్త్రలు పువ్వుల అందచందాలకు ముగ్ధులై తలలో పెట్టుకోవడం, ఆడుకోవడం అసహజంగా చేస్తుంటారు. బతుకమ్మను సొమ్ము చేసుకుంటున్న పాలకవర్గాలు బతుకమ్మ సహజమైనది, మట్టిమనుషుల వారసత్వమని ఒక పక్క ప్రచారం చేస్తూనే పసుపు, కుంకుమ, అగర్‌బత్తీలతో అలంకరించి హైందవీకరించారు. ఇవ్వాళ బతుకమ్మ పట్ల భక్తి కూడా లేకపోగా ఎగ్జిబిషన్‌గా మార్చేశారు. ఉత్పత్తి కులాలు ప్రతి నిత్యం ప్రకృతిలో పని, పాట, ఆటలతో సమష్టి జీవనం సాగిస్తారు. బాధలలోనే సంతోషాన్ని, పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఈ క్రమంలో చేను, చెలక, అడవుల్లో దొరికే గునుగు, తంగేడు, జిల్లేడు, బీర, పొన్న, గన్నేరు, గడ్డి మొదలగు పూలతో బతుకమ్మ ఆడుకుంటారు. ఈ సహజ ప్రక్రియను గతంలో అసహజం చేసినది రాజులు, రాణులు, భూస్వాములు, దొరలు, దొరసానులు. అయితే ఇవాళ పాలకవర్గాలు, మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఖరీదైన బంతి, చేమంతి, గులాబి, ప్లాస్టిక్‌ పూలతో సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ‘మార్కెట్‌’ను పెంచిపోషిస్తున్నారు. కాకతీయుల కాలం నుంచి మొదలైన బతుకమ్మ తెలంగాణలో సామంతులు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, అగ్రకులాల పండుగగా మారింది. ఏ కాలంలోనైనా చెట్టు, పుట్ట తిరిగి పూలు తెచ్చేది ఉత్పత్తి కులాల ప్రజలే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కన్నాముందు ఆయాగ్రామాల ‘పెద్ద దొరల’ గడీల ముందు బతుకమ్మ ఆడాలనే నియమం ఉండేది. దొరల అటవిక ఆనందం కోసం పీడితకులాల స్ర్తీల బట్టలు విప్పించి (బరిబాతల) బతుకమ్మ ఆడించేవారు. రైతాంగ పోరాటం తర్వాత పీడిత ప్రజలలో కొంత చైతన్యం వచ్చి దొరల గడీల ముందు బతుకమ్మ ఆడమని, తామే స్వతంత్రంగా ఆడుకుంటామని నినదించారు. ఈ క్రమంలో వెనకబడ్డ కులాల స్ర్తీలకు బతుకమ్మ కొంత దగ్గరైనప్పటికీ, ఇంకా అగ్రకుల స్ర్తీల అధిపత్యంలోనే ఉంది. దళిత సీ్త్రలకు మాత్రం నేటికీ అంటరానిదే. ప్రగతిశీల రచయితలు ఎదిగాక కొద్దికొద్దిగా స్ర్తీల సమస్యలు, తెలంగాణ పోరు గాథలు ఈ సందర్భంగా పాడుకుంటున్నారు. అలాంటి సహజ బతుకమ్మను కేసీఆర్‌ కూతురు బంగారు బతుకమ్మగా మార్చడం దురదృష్టకరం. కవితకు బతుకమ్మ బాధ తప్ప ఈ సీ్త్రల బాధలేవీ కనిపించడం లేదు. పీడిత సీ్త్రల బతుకులు మారాలని ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఆదివాసీలైన సమ్మక్క సారక్క కాకతీయ రాజులపై తిరగబడ్డారు. 80ఏళ్ళ నాడే చాకలి ఐలమ్మ నిజాం గుండెల్లో నిద్రపోయింది. మలి దశ ఉద్యమంలో (1996) బెల్లి లలిత చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడింది. వీరత్వానికి ప్రతిరూపాలైన తెలంగాణ మహిళలు కేవలం బోనం ఎత్తేవారు, బతుకమ్మ ఆడేవారు మాత్రమేనని సీ్త్రల చైతన్యాన్ని వెయ్యేండ్లు వెనక్కి నెట్టాయి పాలకవర్గాలు. రాజకీయ ప్రయోజనం ఆశించి కేసీఆర్‌ ఆయన బిడ్డ కలిసి బతుకమ్మను ఫ్యాషన్‌పెరేడ్‌గా మార్చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో ప్రజలు దశలు దశలుగా పోరాడారు. ప్రజల త్యాగాల పునాదులపై పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి కనీసం విద్యా ఉద్యోగాలకై పోరాడిన యువతకు భవిష్యత్తుపై నమ్మకాన్ని కూడా కలిగించలేదు. పోగా, 2009 తుదిదశ ఉద్యమానంతరం ఆత్మహత్యలకు ఉసిగొల్పింది. బ్రాహ్మణీయ, భూస్వామ్య, సామ్రాజ్యవాద సంస్కృతిలో భాగమైన పండుగలు (బోనాలు, బతుకమ్మ) ప్రజలవి ఎలా అవు తాయి? ఒకవేళ మెజారిటీ పీడిత మహిళల బతుకులు బాగుపడి సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకు తోచిన రీతిలో బతుకమ్మ ఆడుకుంటారు తప్ప కవిత నాయకత్వం వహించి ఆడించాల్సిన అవసరం లేదు. ప్రాంతాల విభజన తర్వాత తెలంగాణ భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు, వారి ప్రతినిధులకే అధికారం దక్కింది. తెలంగాణ ప్రజలు 1946లోనే భూమి, భుక్తి, విముక్తి జరగాలని ఎలుగెత్తి చాటారు. అంతటి ప్రజల చైతన్యాన్ని సమాధి చేస్తూ వచ్చిన పాలకవర్గాలు కనీస వసతులైనా కల్పించండి బాబోయ్‌ అనే నిస్సహాయ స్థితిలోకి ప్రజల్ని నెట్టేశారు. వెనకబడిన కులాలకు అర్ధ ఎకరం, ఎకరం భూమి ఉన్నా సాగునీరు లేదు. కనీస వసతులు లేవు. దళితులకు సెంటు భూమి కూడా లేదు. కనీసం రేషన్‌ కార్డులు, వృద్ధాప్య, వితంతు ఫించన్లు ఇచ్చినా బాగుండు అనే దీనస్థితిలో ఆ ఊరి జనం ఉన్నారు. అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చీరాగానే టాటా, బిర్లా, అంబానీ వంటి స్వదేశీ పెట్టుబడిదారులను, సింగపూర్‌, మలేషియా విదేశీ పెట్టబడిదారులను ఆహ్వానించారు. సీ్త్రల శరీరాలతో వ్యాపారం చేసే ఆ దేశాల టూరిజం అభివృద్ధి నమూనాను తెలంగాణలో అమలు చేస్తానని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణను ‘మార్కెట్‌’ చేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే 10 జిల్లాలను గాలికి వదిలి హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తానంటున్నారు. మరోపక్క సంక్షేమం అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ‘బంగారు తెలంగాణ’ అని తెలంగాణ మీడియా, మేధావులు కలలు కన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఆ కల మరింత ఊపందుకుంది. నిరంతరం విద్యార్థులు పోరాడి, వెయ్యి మందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకొని టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే కనీసం వారిమీద ఉన్న కేసులైనా ఇంతవరకు కొట్టేయలేదు. మూడు లక్షలమంది ఆదివాసీలను ముంచుతున్న పోలవరం కేసీఆర్‌ దృష్టిలో ముగిసిన కథ! రైతుల మీద అప్పుడే లాఠీ విరిగింది. చట్టాలను పక్కనబెట్టి దొంగలంటూ చట్టానికి అప్పగించకుండా చంపడం మొదలైంది. దళిత సీ్త్రలకు 3 ఎకరాల భూమి చెల్లు చీటి అయింది. హైదరాబాద్‌లో మెట్రో రైలు మార్గానికి ఆరు వందల కోట్లు, ఫార్మా కంపెనీలకు 7 వేల ఎకరాలు, సినిమా రంగానికి రెండు వేల ఎకరాలు, కొత్త విమానాశ్రయాలకు వేల ఎకరాలు, పోలీసులకు ఇన్నోవా కార్లు ఎలా ఇవ్వగలిగారు కేసీఆర్‌? బంగారు తెలంగాణ అంటే ఇదేనా?! ఆంధ్రా బడాబాబుల కబ్జాలో ఉన్న గోకుల్‌ ట్రస్ట్‌ భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అన్న సంచలన వార్త ఇంత వరకు అమలుకాలేదు. ఇంకా అక్రమంగా ఆంధ్రా కబ్జాదారుల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూములు, చెరువులు, కుంటలు, గుట్టలు, కొండలు, మొదలగు వాటి జోలికి ప్రభుత్వం ఇంతవరకు పోలేదు. మరి ప్రజల పక్షం వహించాల్సిన మేధావులు, ముఖ్యంగా ఇక్కడి మట్టిమనుషుల వారసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మేధావులు కేసీఆర్‌ను ఎందుకు భుజాలకు ఎత్తుకుంటున్నట్టు? మీకు కొన్ని రాజకీయ, అధికార పదవులు దక్కితే మీ కులాలు, వర్గాలు బాగుపడ్డట్టేనా? నిన్నమొన్నటి వరకు సీమాం ధ్ర పాలనలో దోపిడీ, అణచివేతలకు గురయ్యామని మాట్లాడిన మీకు కేసీఆర్‌ ప్రభుత్వం పెట్టుబడిదారులకు దోచిపెడుతూ, ప్రజలకు మొండి చెయ్యి చూపడం కనిపించడంలేదా? ఇప్పటికైనా మీవైఖరి మార్చుకొని ప్రజాపక్షం వహించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: