కేవలం 2 రూపాయలకే స్వచ్ఛమైన 20 లీటర్ల తాగునీటిని ప్రజలకు అందించాలన్న ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీ నుండి అమలుచేయతలపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పథకం అమలుపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు చేసిన ప్రకటనలు ఓ విధంగా ఉంటే, ఆచరణలో పరిస్థితి మరో విధంగా గోచరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2నుండి ఎన్టీఆర్ సుజల పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో పథకాన్ని తొలి విడతగా సుమారు 700 గ్రామాల్లో అక్టోబర్ 2నుండి అమలుచేయనున్నట్టు జిల్లాకు చెందిన మంత్రులు, అధికార్లు పదే పదే ప్రకటనలు చేశారు. తీరా ప్రారంభ సమయం సమీపించే సరికి కనీస స్థాయిలో ఆర్‌ఒ ప్లాంట్లు (రివర్స్ ఓస్మాసిస్ పాంట్లు) సిద్ధం కాకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం నిర్దేశిత లక్ష్యం ప్రకారం తొలి దశలో 700 పాంట్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఐతే అక్టోబర్ 2న కేవలం 50 నుండి 70 ప్లాంట్లకు మించి ప్రారంభమయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు 13 కార్పొరేట్ సంస్థలు మాత్రమే ఆర్‌ఒ ప్లాంట్ల నిర్వహణకు ముందుకువచ్చాయి. 700 ప్లాంట్లను జిల్లాకు కేటాయించగా 319 ఆర్‌ఒ ప్లాంట్ల నిర్వహణకు ఆయా సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటిలో కేవలం 50 నుండి 70 లోపు ప్లాంట్లను మాత్రమే అక్టోబర్ 2వ తేదీ నాటికి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేయగలగడం గమనార్హం. ఇందుకు ప్రథాన కారణం ప్లాంట్ల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా సంఘాలు, దాతలు ముందుకు రాకపోవడమేనని అధికారులు చెప్పారు. అలాగే ఆర్‌ఒ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమయ్యే యంత్రాలు చెన్నై తదితర నగరాల నుండి సకాలంలో జిల్లాకు చేరుకోకపోవడం మరో ప్రధాన సమస్యగా ఉంది. జిల్లా యంత్రాంగం ఒత్తిడి మేరకు సామాజిక బాధ్యత కింద కొన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడంతో 319 ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ఆయా సంస్థలకు అప్పగించినప్పటికీ గాంధీ జయంతి నాటికి తూతూ మంత్రంగా మాత్రమే ఈ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: