సీఎం సొంత జిల్లాలోని రైతులు కరువుతో అల్లాడుతున్నారు. ఓవైపు ఖరీఫ్, వర్షాభావం నిండాముంచితే.. మరోవైపు రుణమాఫీ కాక.. రీషెడ్యూల్ పరిహారం అందక అక్కడి అన్నదాత కన్నీరు కారుస్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని రైతన్నల ధీనావస్థలు. చిత్తూరు జిల్లా.. పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. తీరం వెంబడి ఉన్న తూర్పు మండలాల్లో వరి పంట కళకళలాడుతూ ఉంటుంది. వేరుశెనగ, చెరుకును ప్రధాన పంటగా ఇక్కడి రైతులు పండిస్తారు. అయితే గడిచిన ఐదేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్.. జిల్లా రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. సీజన్‌ ముగుస్తున్నా.. చినుకు జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. దీంతో రైతులు.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఖరీఫ్‌ పంటనే నమ్ముకొని భారీగా పెట్టుబడులు పెట్టి.. నష్టాల్లో కూరుకుపోయాడు.  జిల్లావ్యాప్తంగా ఈసారి 4.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయగా.. వీటిలో వేరుశెనగ మాత్రమే 2.96 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు 2.25 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. మదనపల్లె, తంబళ్లపల్లి తదితర మండలాల్లో వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతింది. ప్రత్యామ్నాయ పంటలైన ఉలవలు, కంది, జొన్న, మొక్కజొన్న, రాగి దిగుబడులు కూడా అంతంత మాత్రమే ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  మరోవైపు రుణమాఫీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కొత్త రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. పంట బీమాపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వ్యాపారుల దగ్గర ఇప్పటికే రుణాలను తీసుకున్న రైతులు.. మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి.. తక్షణమే రుణమాఫీ, కొత్త రుణాలు ప్రకటించి తన సొంత జిల్లా రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: