ప్రకృతి ప్రకృతిని భయంకరంగా హింసించింది! జల విలయం తాగడానికి చుక్కనీరు దొరకని ఘోర విపత్తును సృష్టించింది! ప్రళయమారుతం పరిసరాల ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించింది! భూమి గాయపడింది. గుంటలుగా మారింది. బురదలో మునిగింది! ఊపిరాడని ప్రకృతి మధ్య జనం విలవిలమంటున్నారు. వరదలెత్తిన నదులను చూసి విస్మయ చకితులవుతున్నారు! కొట్టుకుపోయిన రహదారులు, కూలిపోయిన వంతెనలు, ఎగిరిపోయిన ఇళ్ల కప్పులు, తెగిపోయిన చెరువుల కట్టలు, వాగుల గట్టులు.. విరుచుకొనిపడిన ‘హుదూద్’ తుపాను ఉత్తరాంధ్ర అంతా బీభత్స దృశ్యాన్ని నిలబెట్టింది. కొన్ని గంటలపాటు కరాళ నృత్యం చేసిన విలయం విశ్రమించింది, కానీ విస్మయం విస్తరించింది! విస్తరించిన విస్మయంనుండి జనం తేరుకునేసరికి వారాలు నెలలు గడిచిపోవచ్చు! పచ్చదనానికి ప్రతీకలైన చెట్లు కూలిపోయాయి. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, వేపచెట్లు, మామిడి చెట్లు.. వేలాదిగా కూకటి వేళ్లతో కూలిపోయాయి! రైలు పట్టాలు కదలిపోయాయి! వందలాది చోట్ల ‘ఇనుపదారి’పై బురద గుంటలు ఏర్పడిపోయాయి! చక్కెర పరిశ్రమలు, బియ్యం మిల్లులు, వందలాది గిడ్డంగులు, వేలాది ఇళ్లు మొండి గోడల శిథిల ప్రాంగణాలుగా మిగిలాయి! పొలాలు, ఆకుపచ్చని అందాలు బురద కింద, నీటి కింద నిశాచరత్వపు గాలుల వికృత కేళీ పైశాచిక పదఘట్టనల కింద కూరుకుపోయాయి! ప్రకృతికి ప్రకృతి చేసిన ‘గాయం’ ఇది! ప్రకృతి ఒడిలోని ప్రాణికోటికి జరిగిన ఘోర అన్యాయమిది! విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి! విద్యుత్ ప్రసారతంత్రులు తెగిపోయాయి! ఆకాశంలో వెనె్నలను మింగిన కారుమబ్బులు విసిరిన కోరలవలె దూసుకు వచ్చిన ‘గాలి తూటాలు’ నేలను తూట్లు పొడిచాయి! విద్యుత్ వెలుగును దిగమింగి చీకటిని నిలబెట్టాయి! ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఖేద భయంకర తమాల వాటిక! ప్రకృతి బీభత్సం ముందు మానవ విజ్ఞానం, పటిమ, ప్రతిభ, ప్రగతి, ప్రయత్నం తలవంచక తప్పదన్న తరతరాల వాస్తవానికి ఊపిరి మిగిలిన ఉత్తరాంధ్ర మరో విషాద సాక్ష్యం! రెండు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొని వచ్చిన హుదూద్ తుపాను నిరూపించిన కఠోర వాస్తవం ఇది! ప్రాకృతిక దురాక్రమణ ముందు తలవంచక తప్పదని తెలిసినప్పటికీ తలపడడం మానవ సహజ ప్రతిస్పందనలో భాగం! అలా ప్రకృతి బీభత్సంతో తలపడడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పురుష ప్రయత్నాని’కి సాకారంగా నిలిచింది! ఈ ప్రయత్నం కారణంగానే ప్రజల ప్రాణాలకు పెద్ద ప్రమాదం తప్పింది! సకాలంలో నడుం బిగించి రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం లక్షలాది మందిని ప్రమాద వాటికనుంచి తప్పించి సురక్షిత ప్రాంగణాలకు తరలించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు, అధికారులు, ఉద్యోగులు, సైనికులు, స్వచ్ఛంద సంస్థలు, సామాన్య ప్రజలు.. ఇలా ఏకోన్ముఖ లక్ష్యంతో అందరూ హంతక ‘హుదూద్’ను ఢీకొన్న తీరు హర్షణీయం, ప్రశంసనీయం! ఆరు లక్షల మంది నిర్వాసితులలో అత్యధికులు సురక్షిత ప్రదేశాలలో ఉండగలగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు ముందు జాగ్రత్తకు నిదర్శనం! కళ్యాణ మంటపాలలో, కమ్యూనిటీ కేంద్రాలలో, పాఠశాలల కళాశాలల భవనాలలో భద్రమైన నిర్వాసితులకు భోజన సదుపాయాలు, మంచినీరు సమకూర్చడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం వైపరీత్య విషాద ప్రభావాన్ని అదుపు చేయగలిగింది! గతంలోవలె జనం జలదిగ్బంధ గ్రస్తులై ఆకలితో అల్లాడిన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు ఆవిష్కృతం కాలేదు! ఇందుకు కారణం అరక్షిత ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత స్థానాలకు తరలించుకుని రావడం.. ఇంటింటికీ బంగాళాదుంపలు, పప్పులు, వంటనూనె, కిరోసిన్, బియ్యం, ఉప్పు సరఫరా చేయనున్నట్టు ప్రకటించడం ద్వారా కూడ ప్రభుత్వం ప్రజలలో ఆకలి బాధను అధిగమించగలమన్న విశ్వాసాన్ని నింపగలిగింది! మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి తక్షణ పరిహారం చెల్లిస్తున్నట్టు ప్రకటించడం, పరిహార పరిమాణాన్ని పెంచడం కూడ ప్రభుత్వం వారి సమయోచిత ప్రతిస్పందనకు నిదర్శనం! నాగావళి, వంశధార పరీవాహ ప్రాంతంలోని దాదాపు వంద గ్రామాల ప్రజలను సురక్షితంగా తరలించడంవల్ల వరదల బీభత్స కాటు పడకుండా వారంతా తప్పించుకోగలిగారు. ప్రభుత్వం ఇలా హుదూద్ హంతక క్రీడను ప్రతిఘటించగలిగినప్పటికీ ఇరవై మందికి పైగా మృత్యువుకు బలి కావడం, వంద మందికి పైగా క్షతగాత్రులు కావడం ‘దైవం’ ప్రతికూలించడానికి తార్కాణం! వేలాది ఆవులు, ఇతర పశువులు కూడ వర్ష మృత్యువుపాలు కావడం గుండెలను పిండి చేస్తున్న మరో విష పరిణామం! నాగావళి తీరం వెంట ఉన్న వందలకు పైగా పల్లెల ప్రజలను బయటికి తరలించినప్పటికీ ఒక గ్రామం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుని పోవడం మిక్కిలి దురదృష్టకరం! సైనిక దళాలు హెలికాప్టర్లు ఎంతమందిని ఆ గ్రామంనుండి బయటికి తరలిస్తారన్నది ఉత్కంఠకు కారణం! ఇప్పటికే లక్షా యాబయి వేల క్యూసెక్కుల వేగంతో ఉద్ధృతంగా పొంగిపొరలుతున్న నాగావళి నీటి పరిమాణం రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగే ప్రమాదం ఉందట! అదే జరిగినట్టయితే జల దిగ్బంధంలోని ఆ గ్రామ ప్రజల భద్రతకు భయంకరమైన ముప్పు వాటిల్లవచ్చునన్న ఆందోళన కూడ కొనసాగుతోంది! సైనిక దళాలు ఆ పల్లెలోని మొత్తం ప్రజలను భద్రంగా తరలించుకుని రాగలరన్నది ప్రస్తుత విశ్వాసం! ప్రకృతి సృష్టించిన బీభత్సానికి మానవ క్రౌర్యం విశాఖ మహానగర వాసులను వెన్నాడుతుండడం మరో వైపరీత్యం! నిత్యావసరాలకు కృత్రిమమైన కొరతను సృష్టించిన దళారులు ధరలను దారుణంగా పెంచేస్తున్నారట! వంద రూపాయలు పెట్టినా పాల పాకెట్ లభించకపోవడం దళారీ వ్యాపారుల దౌష్ట్యానికి చిహ్నం! అలాగే పెట్రోల్ ధరలను కూరగాయల ధరలను కూడా పెంచేశారట! సహాయ చర్యలలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిమగ్నమైన తరుణంలో తమ దౌష్ట్యాన్ని పట్టించుకునేవారు ఉండరన్న దళారీల ధీమా ఈ ధరల పెరుగుదలకు కారణం. కొందరినైనా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టడం అధికారుల తక్షణ కర్తవ్యం! ప్రజల విషాదాన్ని తమ విలాసంగా, అక్రమార్జనకు సాధనంగా మార్చుకోవడం దానవత్వం. యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకున్నప్పటికీ ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు రెండు రోజుల సమయం పడుతుందట! వర్ష బీభత్స తీవ్రతకు ఇది మరో సంకేతం! నౌకాదళ స్థావరం సైతం హుదూద్ విధ్వంస క్రీడకు గురి కావడం ప్రమాదకరమైన పరిణామం! సహాయ చర్యలకు కేంద్రంగా ఉండగల నౌకాదళ స్థావరాలు ధ్వంసమైనట్టయితే సహాయం చేయగలవారెవ్వరు! హుదూద్ అనుభవం దృష్ట్యా ఇలాంటి కీలకమైన నిర్మాణాల భద్రతకు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించవలసి ఉంది! నూతన రాష్ట్రంగా శైశవ దశలో ఉన్న ‘ఆంధ్రప్రదేశ్’ ఈ అనుకోని అశనిపాతం నుంచి బయట పడడానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అనివార్యం. సహాయం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాల తీరు ప్రశంసనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: