సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో అనుకోని అవాంతరం వచ్చింది. ఎవరూ ఊహించలేని ఆ పరిణామం సాధారణ పరిస్ధితులను తలకిందులు చేసింది. అంతే ఒక్కసారిగా శూన్యం ఆవరించింది. కోటానుకోట్ల అంచనాలను సొంతం చేసుకున్న వారు ఎంట్రీ ఇస్తే మునుపటి స్ధితి రావచ్చనేది ఓ అంచనా. ఆ దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయి కూడా. ఇలాంటి విపత్కర పరిణామాల్లో అందరూ ఊహిస్తున్న మార్పు సాధ్యమేనా...? తమిళనాడు రాజకీయాలను జయలలిత ఏలుతున్న తరుణంలో బెంగళూరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఇచ్చిన తీర్పు ఆమె రాజకీయ జీవితంలోనే భారీ కుదుపు. జయ అక్రమాస్ధుల కేసు తమిళనాడు నుంచి బెంగళూరుకు బదిలీ అయిన తర్వాత ఆశించిన ఫలితం వస్తుందనుకున్నారు. అనుకూలంగా తీర్పు వస్తుందనుకుంటే జయలలితకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు 100కోట్ల భారీ జరిమానాను విధించింది.  సెప్టెంబర్‌ 27న తీర్పు వెలువడిన నాటి నుంచి ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకే పరిమితమయ్యారు. అనారోగ్యాన్ని కారణంగా చూపి బెయిల్‌ కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఏమి ఫలించలేదు. దీంతో చేసేది లేక మరోసారి తన అనారోగ్యాన్ని ప్రస్తావిస్తూ జయలలిత బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కారాగారం నుంచి బయటపడేందుకు జయలలిత చేస్తున్న ప్రయత్నాలను చూసిన ఆమె ప్రత్యర్ధి కరుణానిధి చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ వేదాంత ధోరణిలో వ్యంగాస్త్రాలు సంధించారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న జయలలిత కల ఎప్పటికీ నెరవేరదన్నారు. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమ్మ పథకాలపై ఉన్న జయలలిత ఫోటోలను వెంటనే తొలగించాలని కరుణానిధి డిమాండ్ చేసారు. జయ అరెస్టుతో తమిళనాట రాజకీయాల్లో స్తబ్ధత ఏర్పడిందనే చెప్పాలి. సీఎం సీట్లో పన్నీర్‌ సెల్వం కూర్చున్నప్పటికి తమిళ ప్రజలు మాత్రం శూన్యం భర్తీ కావాలని బలంగా కోరుకుంటున్నారు.  ఇదే సరైన సమయంగా భావించిన కాంగ్రెస్‌, బిజెపీలు తమిళనాడులో పాగా వేయాలని పావులు కదుపుతున్నాయి. బిజెపీ అయితే ఏకంగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. మిమ్మల్ని సీఎం చేస్తాం, బిజెపీ తీర్ధం పుచ్చుకుని రంగంలోకి దిగండి అంటూ అమిత్‌ షా ఇప్పటికే రజినీకాంత్‌ను సంప్రదించినట్లు తమిళనాట వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తారే కానీ రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. అలాంటిది తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని భావిస్తున్న తరుణంలో రజనీకాంత్ ఎంట్రీ ఇస్తారా...? ఇస్తే ఏ పార్టీ నుంచి ఇస్తారు..? అనేది రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: