తుపాను బాధితులను యువత ఆదు కోవాలని జనసేన నేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. విశాఖ బాధితులను పరామర్శించేందుకు విశాఖపట్నం వెళ్తూ రాజమండ్రి ఆనంద్‌ రెసిడెన్సీ హోటల్‌లో ఆయన మీడియా సమావేశంలో బుధవారం మాట్లా డారు. ఒకనాటి దివిసీమ ఉప్పెన కంటే ఈ తుపాను భయంకరమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారీస్థాయిలో నష్టం జరిగినప్పటికీ ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, నివేదించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల విలువైన ప్రాణనష్టం నివారించగలడం అభినందనీయమన్నారు. తుపాను బాధిత ప్రాంతాలకు కేంద్ర సహాయం లభిస్తుందని, ఆ విధంగా తాను తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. తాను విశాఖపట్నం వెళ్లిన తరువాత పరిస్థితిని చూసి తన స్పందన తెలియజేస్తానని అన్నారు. ప్రధానమంత్రి మోడీ మాట మీద నిలబడే మంచి మనిషని, ఆయన వ్యక్తిత్వాన్ని తాను రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీకి మద్దతు ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ తక్షణ సహాయంతో రూ.వెయ్యికోట్లు ప్రకటించడం ఆయన పనితీరుకు కితాబు ఇచ్చారు. తుపాను ప్రాంత బాధితులకు యువత వారి శక్తిమేరకు సహాయపడాలని కోరారు. తుపానును ఆసరాగా చేసుకుని పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడేలా ఆ ప్రాంత వ్యాపారులు నిత్యవసర సరుకుల పంపిణీలో ఎలాంటి బ్లాక్‌ మార్కెటింగ్‌ విధానాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. పవన్‌కల్యాణ్‌ వెంట రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యన్నారాయణ, పవన్‌కల్యాణ్‌ సినీఫ్యాన్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: