హుధుద్‌ తుపాను ప్రభావంతో ఐదు రోజులుగా నరకం చూసిన బాధితులు గురువారం బిందెడు నీటి కోసం బోరింగులు, వాటర్‌ ట్యాంకర్ల వద్ద నానాపాట్లు పడుతున్నారు. నగరంలో రాత్రి పగలు తేడా లేకుండా ట్యాంకులు వచ్చే ప్రాంతాల్లో నిరీక్షిస్తున్నా చుక్కనీరు దక్కే పరిస్థితి కానరాలేదు. నగరవాసులకు ప్రధానంగా నీరందించే టిఎస్‌ఆర్‌ పంపింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యేల అనుచరగణం హవాపై బాధితులు తిరగబడుతున్నారు. తమ వార్డులకు నీటి ట్యాంకర్ల కోసం తెల్లవారుజాము నుండే క్యూకట్టి ట్యాంకర్‌ కూపన్‌ పొందినప్పటికీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వారిని అక్కడే దించివేసి తమ అనుచరులను ట్యాంకర్‌లో ఎక్కించి వారికి అనుకూలమైన చోట్లకు తరలించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నీటి సరఫరా అధికారులతో వాగ్వివాదానికి దిగిన ఎమ్మెల్యే 15 నుండి 20 ట్యాంకర్లు తమ నియోజకవర్గ పరిధిలోకి తరలించుకుపోవడంతో నీటి కోసం అక్కడ వేచి ఉన్న ప్రజలంతా ఆందోళనకు దిగారు. ఇదే తరుణంలో అక్కడకు చేరుకున్న మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ కూడా ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారు. సామాన్యులు పెద్దఎత్తున అక్కడకు తరలివచ్చి తమ వార్డులలోకి నీటి ట్యాంకర్లు పంపించాలంటూ వేడుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. జీవీఎంసీ వాటర్‌ సప్లయి అధికారులు సైతం ఎమ్మెల్యేల హవాపై విసుగు చెందారు. నీటి సరఫరా లేనిచోట్లకు ట్యాంకర్లు పంపాలని, అయితే ఎమ్మెల్యేలు బలవంతంగా మంత్రులు, ఉన్నతాధికారులతో సిఫార్సులు చేయించడంతో సమన్యాయం చేయలేకపోతున్నామని గగ్గోలు పెడుతున్నారన్నారు. మరోపక్క మంత్రి నారాయణ సైతం ప్రైవేటు ట్యాంకర్లతో హోటళ్లు, విద్యా సంస్థ అధిపతులకు దొడ్డిదారిన పంపడాన్ని చూసిన అనేకమంది ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. సామాన్య ప్రజలు గొంతెండి గుక్కెడు నీటి కోసం గగ్గోలు పెడుతుంటే ప్రజా ప్రతినిధులు అనుచరగణంతో ట్యాంకర్లు దారిమళ్లించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రైవేటు ట్యాంకర్ల హవాకు హద్దే లేకుండాపోయింది. ఒక్కో ట్యాంకరు నీరు వేలకు వేల రూపాయల ధర పలుకుతోంది. విద్యుత్‌ లేక, నీళ్ళు లేక విలవిలలాడుతున్న పరిస్థితిని ట్యాంకర్ల వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: