రాష్ట్ర రాజధాని నిర్మాణానికి బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించాలని ప్రభు త్వం నిర్ణయించింది. బిల్డ్‌ ఆంధ్రా పేరిట ఈ బాం డ్లను ప్రభుత్వం జారీ చేయనుంది.రుణమాఫీ హామీ అమలులో భాగంగా రైతులకు బాండ్లు జారీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలి సిందే. తాజాగా రాజధాని నిర్మాణం కోసం బాండ్లు జారీ చేయాలన్న ప్రతిపాదనను రిజర్వు బ్యాంకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. దీనికి రిజర్వు బ్యాంకు కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు తెలిపారు. ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌తో సచివాలయంలో బుధవారం ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆర్థికశాఖ మంత్రి బిల్డ్‌ ఆంధ్రా బాండ్ల జారీకి అనుమతి ఇవ్వాలని కోరారు. బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైతే వాటిని తనఖా పెట్టుకోవడానికి కూడా బ్యాంకులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై పూర్తిస్థాయి వివరాలు పంపాలని, వాటిని పరిశీలించి బాండ్ల జారీకి తగిన సమయం ఇస్తామని ఆర్‌బిఐ గవర్నర్‌ హామీ ఇచ్చారని యనమల చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే మొత్తాన్ని కేంద్రం భరించాల్సిఉంది. అయితే, భారీ అంచనాల నేపధ్యంలో అంత మొత్తం కేంద్రం నుండి రాదన్న భావిస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. దీనిలో భాగంగా బాండ్ల జారీ అంశం ముందుకువచ్చింది. ప్రజల నుండి నిధులు సేకరించి నిర్ణీత కాలం తరువాత వడ్డీతో కలిపి చెల్లించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, బాండ్ల జారీ ప్రక్రియను ఏ శాఖకు అప్పగించాలన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అప్పగించాలన్న సూచన ప్రభుత్వ వర్గాలనుండి వస్తోంది. అదే సమయంలో రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేయనున్న సంస్థకే ఈ బాధ్యతను అప్పగించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. నిధుల సమీకరరణ కోసం ఏర్పాటుచేసిన కమిటీ త్వరలో జరిపే సమావేశంలో ఈ విషయమై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. బాండ్ల జారీ ద్వారా కనీసం 25వేల కోట్ల రూపాయలను సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: