రోజుకో వ్యూహం.. పూటకో ప్రణాళిక.. ఇదే రాజకీయమంటే.. పొలిటికల్ లీడర్ అనేవాడు ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూనే ఉండాలి. అది పాజిటివ్ గానైనా.. నెగిటివ్ గా నైనా... జనం మెచ్చుకోనీ.. తిట్టనీ.. కానీ జనం దృష్టి ఎప్పుడూ తనపై ఉండేలా చూసుకోవాలి. అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. ఈ రాజకీయ సూత్రాలు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకు ఇంకా బాగా వర్తిస్తాయి. మరి వైకాపా అధినేత జగన్, ఆయన క్యాడర్ ను చూస్తే అలాంటి ప్రయత్నమేదీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షలంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతుండేవాడు. ఎన్నికలతో సంబంధం లేకుండా యాత్రలు చేసేవాడు. ఇక ప్రకృతి విపత్తుల సాయంలో ఘటనాస్థలానికి వెళ్లడంలో అందరి కంటే ముందుండేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఇదే తీరు. కానీ ప్రస్తుత ప్రతిపక్షనేత జగన్ తీరు చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తుంది. తుపాను వంటి కష్ట సమయాల్లో కష్టపడి పనిచేస్తేనే జనంలో గుర్తింపు వస్తుంది. ఒక రకంగా తుపాను వంటి రాజకీయ అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నట్టే కనిపిస్తోంది. వయసులోనూ కుర్రాడైన జగన్.. తుపాను వేళ చొరవ చూపించి.. సహాయ చర్యల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఉంటే.. రాజకీయంగానూ లాభపడేవాడు. యథారాజా తథా ప్రజా అన్నట్టు.. ఆయనలాగానే ఆయన క్యాడర్ కూడా తయారైంది. వారు కూడా పెద్దగా సహాయ చర్యల్లో కనిపించడం లేదు. అంతేకాదు.. తుపాను సహాయ చర్యల్లో లోపాలను ఎండగట్టడంలోనూ వైకాపా విఫలమైందనే చెప్పాలి. తుపాను వంటి విపత్తుల సమయంలో చంద్రబాబు అండ్ టీమ్ దూసుకుపోతుంటే.. జగన్ జట్టు చతికిలపడి నేల చూపులు చూస్తోంది. మిగతావిషయాల్లో ఎలా ఉన్నా.. ఇలాంటి వాటిల్లో జగన్ చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: