మీడియా అంటే ప్రజాగొంతుక. టీవీ,పేపర్, వెబ్.. సోషల్ నెట్ వర్కింగ్.. అది ఏ మాధ్యమమైనా.. ప్రజల గొంతును వినిపించడమే దాని ప్రధాన బాధ్యత. కానీ విశాఖ తుపాను కవరేజిని పరిశీలిస్తే.. ఈ ప్రాధమిక సూత్రాన్ని తెలుగు మీడియా విస్మరించినట్టు కనిపించింది. మీడియాలో ఎక్కువ శాతం చంద్రబాబు అనుకూల మీడియా వుండటం వల్ల కావచ్చు.. తుపాను ప్రభావం వల్ల బాధితుల వద్దకు మీడియా చేరుకోలేకపోవడం వల్ల కావచ్చు.. ఈసారి ప్రజల స్వరం ఎక్కువగా వినిపించలేదు. కనిపించలేదు. గతంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పడు.. ఎప్పుడు టీవీలు పెట్టినా.. బాధితుల కష్టాలు, కన్నీళ్లు, ఆక్రందనలు కనిపించేవి.. ఈ హుదుద్ తుపాను కవరేజీలో మాత్రం.. ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశాలు. పర్యటనలు, మంత్రుల కవరేజీ.. ఇవే కనిపించాయి. దాదాపు 30 మంది వరకూ తుపాను కారణంగా చనిపోయినా... మృతుల కుటుంబాల ఆక్రందన టీవీల్లో వినిపించలేదు. మీడియాలో ఎక్కువగా ప్రభుత్వ వాదనే వినిపించింది. సాక్షి వంటి ఒకటి రెండు చానళ్లలో తప్ప బాధితుల గోడుకు ఈసారి మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదు. మీడియా యాక్టివ్ గా పనిచేసినప్పడే ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు ఎక్కువ సహాయం అందుతుంది. సహాయ కార్యక్రమాల్లో అలసత్వాన్ని ప్రశ్నించినప్పుడే... ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తుంది. సహాయ కార్యక్రమాలు, ప్రజల కష్టాలు, ఇబ్బందులు.. వీటిపై దృష్టి పెట్టాల్సిన మీడియా... ప్రభుత్వ భజన కార్యక్రమంలో మునిగిపోతే.. నష్టపోయేది జనమే. జనం గొంతును తొక్కిపెట్టి వార్తలు ఇస్తే.. మళ్లీ ఆ జనమే తగిన సమయంలో బుద్ది చెబుతారు. మీడియా కూడా ఓ రాజకీయ పార్టీ కార్యకర్తల్లా మారిపోయి పనిచేసే దుస్థితి దాపురిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: